Share News

పోదాం.. జన జాతరకు

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:19 AM

మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గల పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి శతాబ్ధాల చరిత్ర ఉంది.

పోదాం.. జన జాతరకు
పార్వతీ రామలింగేశ్వరాలయం

జాతరకు పార్వతీ రామలింగేశ్వరాలయం ముస్తాబు

గోధుమ పిండితో శివలింగం

నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు

వేములపల్లి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గల పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి శతాబ్ధాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని కాకతీ య గణపతి దేవుడికి సామంతులుగా కొనసాగిన రేచర్ల రెడ్డి రాజులు నిర్మించినట్లు చారిత్రక శాసనాలు చెబుతున్నాయి. నేటికీ ఆలయ పరిసరాల్లో వాటి ఆనవాళ్లు ఉండడం వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంతో విశిష్టితగల ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే హోలీ పండుగకు ముందు మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించి, చివరి రోజు అగ్నిగుండాల ప్రవేశంతో ఉత్సవాలను ముగించడం ఆనవాయితీ. బుధవారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతర, క్రీడా పోటీలను ప్రారంభిస్తారని ఆలయ చైర్మన్‌ తాళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్ల ఆయన తెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా భ క్తులు త రలివస్తారని పేర్కొన్నారు.

మూడు రోజుల పాటు ఉత్సవాలు

ఆమనగల్లు గ్రామంలోని పార్వతీరామలింగేశ్వర ఆలయంలో కల్యాణం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, 13న గణపతిపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, ధ్వజారోహణం, అంకు రార్పణ, తెల్లవారుజామున 4గంటలకు(శుక్రవారం) స్వామివారి కల్యాణం, 14న తెల్లవారుజామున 4గంటలకు(శనివారం) అగ్నిగుండాలు నిర్వహిస్తారు. 15న ఆలయ సమీపంలోని భద్రకాళి అమ్మవారికి బోనాల సమర్పిం చడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ చైర్మన్‌ తాళ్ల వెంకటేశ్వర్లు, పూజారి రెంటా మణిశర్మ తెలిపారు.

రాష్ట్ర, జిల్లాస్థాయి క్రీడాపోటీలు

రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్ర, జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు, జిల్లా స్థాయి కోలాట, డప్పు పోటీలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభిస్తారు.

Updated Date - Mar 12 , 2025 | 12:19 AM