KTR Challenges CM Revanth Reddy: చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేలిపోవాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:16 AM
హైదరాబాద్ అభివృద్ధి అంశంపై చర్చ పెడితే బీఆర్‌ఎస్ హయాంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో తేలిపోతుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
బీఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన అభివృద్ధిపై నివేదిక విడుదల
దమ్ముంటే ఫార్ములా ఈ కేసులో తనను అరెస్టు చేయాలని వ్యాఖ్య
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ అభివృద్ధి అంశంపై చర్చ పెడితే బీఆర్‌ఎస్ హయాంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో తేలిపోతుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చర్చకు సిద్ధమా ? అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు. ఆ చర్చతో చెత్త ఎవరిదో ? సత్తా ఎవరిదో తేలిపోతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓడిపోతామనే అసహనంతో ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన నివేదికను బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అనైతిక బంధం కొనసాగిస్తున్నాయని, రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మోదీతో రేవంత్‌రెడ్డిది ఫెవికాల్ బంధమన్నారు. సీబీఐ, ఈడీ తదితర సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే అవే సంస్థలను రేవంత్ నమ్ముతారని విమర్శించారు. ఏడాదిన్నర, రెండేళ్లలో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్.. కాంగ్రెస్ పుట్టక ముందు నుంచే దేశంలో ముస్లింలు ఉన్నారన్నారు. మైనార్టీలను అవమానించినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్‌ను ఎవరు ఎంత అభివృద్ధి చేశారో తేల్చేందుకు దమ్ముంటే చర్చకు రావాలని సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్‌ల్లో ఎక్కడ చర్చ పెట్టినా తాను వస్తానని స్పష్టం చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో.. రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఆ చర్చతో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలిపోవాలన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే అసహనంతో సీఎం ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన భాషలో అర్థమయ్యేటట్లు బదులిచ్చే సత్తా ఉన్నా.. తాము గౌరవంగానే మాట్లాడతామని చెప్పారు. ఇక, 2014 నుంచి 2023 వరకు తమ హయాంలో జూబ్లీహిల్స్‌లో ప్రజా సంక్షేమ, ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.5,328 కోట్లు వెచ్చించామని, 2,12,362 మంది లబ్ధిదారులు ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని, వాటినే ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. హైదరాబాద్‌లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. కేసీఆర్ హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మారిస్తే..ప్రస్తుత ప్రభుత్వం మురికి కూపంగా మార్చిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించారని, ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రస్తుత ప్రభుత్వం హైడ్రాతో వేలాది ఇళ్లను కూల్చేసిందన్నారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పారిపోయారని ఆరోపించారు.
నువ్వు మొగోనివైతే.. లైడిక్టెటర్ చర్చకు రా!
ఫార్ములా ఈ కేసులో గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినా, చార్జ్‌షీట్‌లో విషయం లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ విషయంలో.. దమ్ముంటే ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలన్నారు. అలాగే, తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని.. మొగోనివైతే నువ్వు కూడా లైడిటెక్టర్ టెస్టుకు రా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. హైదరాబాద్‌లో క్రైమ్ రేటు పెరగడం, పట్టపగలే హత్యలు జరుగుతుండడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి.. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లు అడగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.