Pneumonia Suspected: గొడుగుపల్లి అడవిలో చిరుత మృతి
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:11 AM
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో కదల్లేని స్థితిలో కనిపించిన చిరుతపులి మంగళవారం మృతిచెందింది...
న్యూమోనియాతో మరణించినట్టు అనుమానం
దౌల్తాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో కదల్లేని స్థితిలో కనిపించిన చిరుతపులి మంగళవారం మృతిచెందింది. సోమవారం మధ్యాహ్నం గొడుగుపల్లికి చెందిన భిక్షపతి అనే రైతు తన పొలం వద్దకు పశువులను మేపడానికి తీసుకెళ్తుండగా, పొదల్లో దాగి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా దాడికి యత్నించింది. రైతు భయంతో కేకలు వేయడంతో పొదల్లోకి చేరింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పరిశీలించారు. ఆ సమయంలో చిరుత అటూ ఇటూ కదలడం తప్ప లేచి పరుగు పెట్టలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఆ చిరుత మృతిచెంది కనిపించింది. జిల్లా వెటర్నరీ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని శవపరీక్షలు నిర్వహించారు.న్యుమోనియా సోకడం వల్లే చిరుత మృతి చెంది ఉండవచ్చని డీఎ్‌ఫవో కంప శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి చిరుతపులి కళేబరంలోని కొన్ని కీలక భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు ఆయన చెప్పారు.