Share News

Legal Hurdles Showing FDI Inflows: న్యాయ చిక్కులే సమస్య

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:23 AM

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రావాలంటే... ప్రభుత్వాలు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ....

Legal Hurdles Showing FDI Inflows: న్యాయ చిక్కులే సమస్య

  • ఎఫ్‌డీఐల రాకకు ఇవే అడ్డంకులు

  • ‘స్టెరిలైట్‌’ ఎండీ అంకిత్‌ అగర్వాల్‌

  • ప్రతిభకు భారత్‌ గ్లోబల్‌ లీడర్‌

  • సింగపూర్‌ ఏజీఐడీసీ సీఈవో హోలాండ్‌

  • ‘పెట్టుబడులు, అభివృద్ధి’పై ప్యానల్‌ చర్చ

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రావాలంటే... ప్రభుత్వాలు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ అంకిత్‌ అగర్వాల్‌ సూచించారు. ప్రస్తుతం పరిశ్రమలకు అనుమతులు, ఇతర వివాదాల పరిష్కారంలోనే ఎక్కువ కాలం గడిచిపోతోందని అన్నారు. అందుకే ప్రపంచ స్థాయి సంస్థలు భారత్‌కు రావాలంటే ఆలోచిస్తున్నాయని చెప్పారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా ‘పెట్టుబడులు, అభివృద్ధి: పెట్టుబడి మార్గాలు, ఆర్థిక వ్యవస్థ వ్యూహం, ప్రధాన రంగాలు’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొన్నారు. డెలాయిట్‌ సౌత్‌ ఏషియా జీసీసీ ఇండస్ట్రీ భాగస్వామి రోహన్‌ లోబో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అంకిత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ... భారత్‌ ఐటీ పరిశ్రమపైనే ఆధారపడకుండా... తయారీ రంగంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

ఏ రంగంలోనైనా ప్రతిభలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌ అని, ఇలాంటి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాల సింగపూర్‌ ఏజీఐడీసీ సీఈవో మైక్‌ హోలాండ్‌ సూచించారు. ఇక్కడ యువ జనాభా ఎక్కువ ఉండడం వల్ల వర్క్‌ ఫోర్స్‌ను పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆర్‌ఈ సస్టైనబిలిటీ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.గౌతంరెడ్డి మాట్లాడుతూ... కాలుష్య నియంత్రణ రంగంలోనూ పెట్టుబడులు రావాల్సి ఉందని అన్నారు. నీటి సంరక్షణ, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌, రీసైక్లింగ్‌ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందని తెలిపారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తేనే ఈ రంగాల్లో పెట్టుబడులు వస్తాయని చెప్పారు. రోహన్‌ లోబో మాట్లాడుతూ తెలంగాణ రూ.18 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ రాష్ట్రంగా అవతరించిందని, ఇందులో రూ.3 లక్షల కోట్లు ఐటీ రంగం నుంచే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి మాట్లాడుతూ...రాష్ట్రం ఫార్మా రంగంలో గ్లోబల్‌ హబ్‌గా అవతరించిందని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్‌, క్లీన్‌ మొబిలిటీ, సెమీ కండక్టర్స్‌, ఆహారశుద్ధిరంగాలు జీఎస్‌డీపీకి 60-70శాతం వాటా అందిస్తున్నాయని వివరించారు.


జీసీసీల ఏర్పాటులో మూడో స్థానంలో తెలంగాణ

తెలంగాణలో ప్రస్తుతం 500 జీసీసీలు (గ్లోబల్‌ కాపబిలిటీ సెంటర్లు) ఉన్నాయని.. రానున్న పదేళ్లలో జీసీసీల ఏర్పాటుపరంగా దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉండనుందని స్టెరిలైట్‌ టెక్‌ ఎండీ అంకిత్‌ అగర్వాల్‌ అన్నారు. భారతదేశం ఐటీతో పాటు ఉత్పాదక రంగంపైనా దృష్టి పెట్టి, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘తెలంగాణ రైజింగ్‌ -గ్లోబల్‌ సమ్మిట్‌’లో జీసీసీలపై మంగళవారం జరిగిన ప్యానల్‌ చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వినియోగదారుల పరంగా భారత్‌లో పెద్ద మార్కెట్‌ ఉండడంతో ప్రపంచ స్థాయి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇందులో ప్రధానంగా నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ ఎండీ గౌతమ్‌రెడ్డి అన్నారు. ఒక్క హైదరాబాద్‌లో జరిగినంత మేర దేశంలో మరే నగరంలో సీవరేజీ ట్రీట్‌మెంట్‌ జరగడం లేదని స్పష్టం చేశారు. దేశంలో ఏ నగరంలో కూడా కుళాయి నుంచి వచ్చే నీటిని నేరుగా తాగే అవకాశాలు లేవని.. కానీ, రాష్ట్రంలో సురక్షిత తాగునీటిని కుళాయి ద్వారా అందిస్తున్నారనిగుర్తుచేశారు. కాగా.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్రీ పిల్లర్‌ రోడ్‌మ్యా్‌పను అమలు చేస్తున్నామని పరిశ్రమల శాఖ సంచాలకుడు నిఖిల్‌ చక్రవర్తి తెలిపారు.

Updated Date - Dec 10 , 2025 | 04:23 AM