Share News

Human Rights Activists Protests: బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపి.. శాంతి చర్చలు జరపాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:50 AM

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మనుషుల ఊచకోతకు పాల్పడుతుంటే సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం బాధాకరమని....

Human Rights Activists Protests: బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపి.. శాంతి చర్చలు జరపాలి

  • సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం బాధాకరం: కూనంనేని

  • బూటకపు ఎన్‌కౌంటర్లు చేసిన వారిపై కేసులు పెట్టాలి: కోదండరాం

  • మావోయిస్టులను చంపే అధికారం కేంద్రానికి ఎక్కడిది?: జాన్‌వెస్లీ

  • ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సలైటా?: హరగోపాల్‌

కవాడిగూడ/ఇల్లెందుటౌన్‌/సిద్దిపేట క్రైం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మనుషుల ఊచకోతకు పాల్పడుతుంటే సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం బాధాకరమని, ఇప్పటికైనా బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ వ్యవస్థ సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లను కేంద్రం తక్షణమే నిలిపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బూటకపు ఎన్‌కౌంటర్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష, రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, ప్రజాసంఘాల పౌరహక్కుల ప్రతినిధులతో కలిసి నిరసన చేపట్టారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని.. ఎన్‌కౌంటర్లను ఆపి అటవీ సంపదను కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కూనంనేని మాట్లాడుతూ.. మావోయిస్టులను చంపినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పట్ల చాలామంది మూగవేదనకు ప్రతీకగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. టీజేఎస్‌ చీఫ్‌, ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి బూటకపు ఎన్‌కౌంటర్లు ఒక గొడ్డలి పెట్టు లాంటివన్నారు. చట్టవిరుద్ధంగా బూటకపు ఎన్‌కౌంటర్లు చేసిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మాట్లాడుతూ.. మనుషులను చంపే అధికారం కేంద్రానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ప్రాణాలు తీసే అధికారం రాజ్యానికి లేదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సలైట్‌ అవుతారా అని నిలదీశారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పట్టుకున్న మావోస్టులను తక్షణమే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్‌ చేశారు. అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే కుట్ర జరగుతోందని, అందులో భాగంగానే ఆదివాసులకు అండగా ఉన్న నక్సల్స్‌ను చంపుతున్నారని వామపక్ష పార్టీల నేతలు పోటు రంగారావు, సాధినేని వెంకటేశ్వరరావు తదితరులు మండిపడ్డారు.

పలు చోట్ల నిరసనలు..

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష, పౌర హక్కుల సంఘాల నేతలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వామపక్షాల నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సిద్దిపేటలో ఉమ్మడి మెదక్‌ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు భూపతి డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 22 , 2025 | 04:50 AM