Share News

Left Parties and TDP Make Strategic Gains in Panchayat Elections: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు!

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:11 AM

పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీలు తమ ప్రభావం ఉన్న చోట్ల సొంతంగా.. కొన్నిచోట్ల ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించి పట్టు నిలుపుకొన్నాయి.....

Left Parties and TDP Make Strategic Gains in Panchayat Elections:  పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు!

  • పంచాయతీ ఎన్నికల్లోసీపీఎంకు 48, సీపీఐకి 63 స్థానాలు

  • సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌కు 10

  • టీడీపీకి 8.. జాగృతికి 2 స్థానాలు

ఖమ్మం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీలు తమ ప్రభావం ఉన్న చోట్ల సొంతంగా.. కొన్నిచోట్ల ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించి పట్టు నిలుపుకొన్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కమ్యూనిస్టులు ఆయా పంచాయతీల్లో ఎర్రజెండా ఎగుర వేశాయి. టీడీపీ కూడా ఉనికి చాటుకుంది. ఆ పార్టీ ఎనిమిది పంచాయతీలు దక్కాయి. ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు ఎవరూ పట్టించుకోకపోయినా.. స్థానికంగా కార్యకర్తలు ఉత్సాహం చూపి పంచాయతీ ఎన్నికల బరిలో దిగారు. స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. టీడీపీ కొన్నిచోట్ల కాంగ్రె్‌సకు, మరికొన్నిచోట్ల బీఆర్‌ఎ్‌సకు, మరికొన్ని చోట్ల వామపక్షాలకు మద్దతు ఇచ్చింది. అత్యధికంగా పలు జిల్లాల్లో టీడీపీ.. కాంగ్రెస్‌ వెంటే నడిచినట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం 48 పంచాయతీలు గెలిచింది. వీటిలో ఖమ్మం జిల్లాలో 24, కొత్తగూడెం జిల్లాలో 13, నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాల్లో ఆరు చొప్పున, భువనగిరిలో 4, నారాయణపేట్‌, సిరిసిల జిల్లాల్లో రెండు చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఒక స్థానం ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో సీపీఎం.. బీఆర్‌ఎ్‌సతో పొత్తుపెట్టుకుని పాలేరు, మధిర నియోజకవర్గాల్లో ఆశాజనక ఫలితాలు సాధించింది. గతంలో బీఆర్‌ఎస్‌, సీపీఎం మధ్య ఎక్కడా పొత్తులేదు. ఈసారి పొత్తులో ముదిగొండ, ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, చింతకాని, బోనకల్‌ మండలాల్లో మంచి ఫలితాలు సాధించింది. సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం సొంతజిల్లాలో ఈసారి సీపీఎం కూడా బలాన్ని చూపించింది. కొత్తగూడెం జిల్లాలోనూ పట్టునిలుపుకొంది. సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో గెలిచిన ఆరుచోట్ల బీఆర్‌ఎ్‌సతో, కొన్నిచోట్ల, కాంగ్రె్‌సతో పొత్తుపెట్టుకుంది. సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 63 పంచాయతీలు గెలిచింది. ప్రధానంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం జిల్లాలో 29 పంచాయతీలు గెలిచి సత్తా చాటింది. కొన్ని చోట్ల కాంగ్రె్‌సతో పొత్తు ఉండగా కొన్నిచోట్ల సొంతంగానే విజయబావుటా ఎగురవేసింది. ఖమ్మం జిల్లాలో పది పంచాయతీలు గెలిచింది. ఇందులో సొంతంగా కొన్ని, కొన్ని కాంగ్రె్‌సతో పొత్తులో గెలిచింది. అలాగే నల్లగొండ జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 4, భువనగిరి జిల్లాలో 3, నాగర్‌కర్నూలు, మంచిర్యాల, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాలో ఒకటి చొప్పున పంచాయతీల్లో సీపీఐ విజయం సాధించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎక్కువ పంచాయతీలు సాధించగలిగాయి. ఇతర జిల్లాల్లోనూ తమ ఉనికి చాటాయి. సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ మొత్తం 10 పంచాయతీలను గెలిచింది. మాస్‌లైన్‌ గెలుచుకున్న పంచాయతీలన్నీ సొంతంగా గెలిచినవే. భూపోరాటాలు, పేదల ఇళ్లస్థలాలు, అటవీ భూములకోసం పోరు పేరుతో పేదలపక్షాన ఆందోళన చేపట్టే గిరిజన గ్రామాల్లో మాస్‌లైన్‌ పాగా వేసింది. ఇక తెలంగాణ జాగృతి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు రెండు చోట్ల గెలిచారు. నిజామాబాద్‌ జిల్లాలోని రేంజల్‌ మండలం తాడ్‌బిలోలి సర్పంచ్‌గా డాక్టర్‌ తెలంగాణ శంకర్‌ గెలుపొందారు. ఇదే మండలంలోని వీరన్నగుట్ట తండా పంచాయతీ సర్పంచ్‌గా జాదవ్‌ సుమలత గెలిచారు.


కొడంగల్‌ పరిధిలో ఓ చోట టీడీపీ ఏకగ్రీవం

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ 8 గ్రామాల్లో విజయం సాదించింది. వాటిలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులపై విజయం సాధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మంజిల్లా కామేపల్లిలో టీడీపీ అభ్యర్థి అజ్మీర బుల్లి ఘన విజయం సాధించారు. వాస్తవానికి తమ పార్టీలోకి వస్తే సర్పంచ్‌ అభ్యర్థిగా నిలబెడతామని కాంగ్రెస్‌ నాయకులు ఆమెకు ఆఫర్‌ ఇచ్చారు. తొలినుంచి టీడీపీలోనే ఉన్న ఆమె టీడీపీ అభ్యర్థిగానే బరిలో దిగారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌, వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో కూడా బీఆర్‌ఎస్‌, సీపీఎం మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విద్యావంతురాలైన వడ్డె విశాల కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. మధిర మండలం అల్లీనగరంలో కాంగ్రెస్‌ మద్దతుతో పోటీచేసిన టీడీపీ అభ్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. కొణిజర్ల మండలం పెద్దగోపతిలోనూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తదితర పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలం కోయగూడెం పంచాయతీలో కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసి బీఆర్‌ఎ్‌సపై గెలుపొందింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని నారాయణపేట్‌ జిల్లా మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లి పంచాయతీని టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల గట్టుబత్కూరుకు చెందిన మాల్కాపురం రాజేశం 15ఏళ్లుగా టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముగ్గురు పిల్లల నిబంధన కారణంగా గతంలో పోటీచేసే అవకాశం దక్కలేదు. ఈసారి నిబంధనలు మారడంతో గ్రామం బీసీ మహిళకు రిజర్వు చేయడంతో రాజేశం తన భార్య రాజేశ్వరిని బరిలో దించారు. ఆమె 208ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Updated Date - Dec 16 , 2025 | 05:11 AM