Share News

Union Minister Arjun Ram Meghwal: న్యాయవాదుల భద్రతపైలా కమిషన్‌ నివేదిక తర్వాతే నిర్ణయం

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:38 AM

దేశంలోని న్యాయవాదుల భద్రత అంశంపై లా కమిషన్‌కు నివేదించామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ తెలిపారు....

Union Minister Arjun Ram Meghwal: న్యాయవాదుల భద్రతపైలా కమిషన్‌ నివేదిక తర్వాతే నిర్ణయం

  • త్వరలో న్యాయవాదులకు ‘వైద్య బీమా’

  • కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోని న్యాయవాదుల భద్రత అంశంపై లా కమిషన్‌కు నివేదించామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ తెలిపారు. లా కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత ఈ విషయమై కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని శుక్రవారం బీజేపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ఇక, త్వరలో దేశవ్యాప్తంగా న్యాయవాదులకు వైద్య బీమా పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఇందుకు బార్‌ కౌన్సిల్‌ కొంత ప్రీమియం చెల్లిస్తే.. కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల సంఖ్యపై ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరముందన్నారు. వచ్చే మూడేళ్లలో పలు శాఖల్లో సంస్కరణలు రాబోతున్నాయని, బ్రిటిష్‌ చట్టాల స్థానే.. వర్తమాన, సామాజిక పరిస్థితులకనుగుణంగా సమూల మార్పులు చేయాలని మోదీ సర్కారు భావిస్తోందన్నారు. బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు అర్థరాత్రి నిర్ణయం కాదని, వాటితో పేదలు, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మాట్లాడుతూ త్వరితగతిన న్యాయం కోసం మోదీ సర్కారు.. భారత న్యాయ సంహిత చట్టాలు అమల్లోకి తెచ్చిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులను పట్ట పగలు హత్య చేశారని, న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు సునీల్‌ గౌడ్‌, బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 03:38 AM