Midnight Dance Party: మంచాల మండలంలో ముజ్రా పార్ట్టీ కలకలం
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:05 AM
రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన ముజ్రా పార్టీ కలకలం రేపింది. మంచాల మండలం లింగంపల్లి....
8 మంది యువతులతో పాటు మరో 25 మంది అరెస్టు
పార్టీకి హాజరైన వారిలో రాజకీయ నేతల కుటుంబీకులు
మంచాల, అక్టోబర్ 16(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన ముజ్రా పార్టీ కలకలం రేపింది. మంచాల మండలం లింగంపల్లి శివారులోని ఓ ఫామ్‌హౌ్‌సలో కొందరు యువకులు పీకలదాకా మద్యం తాగి యువతులతో నృత్యాలు చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై నాగేశ్వర్‌రావు సిబ్బందితో కలిసి ఫామ్‌హౌ్‌సకు వెళ్లి సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ మద్యం సేవిస్తూ 24 మంది పురుషులు, నృత్యం చేస్తూ 8 మంది యువతులు కనిపించారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు వినోదం కోసం యువతులను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్ నిర్వాహకుడితో పాటు పార్టీకి వచ్చిన 24 మంది పురుషులు, 8 మంది మహారాష్ట్రకు చెందిన యువతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరు వినియోగించిన 8 కార్లు, 11 ద్విచక్ర వాహనాలు, 25 మొబైల్ ఫోన్‌లు, రూ.2.45 లక్షల నగదు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల్లో కొన్నింటికి ఎంఎల్‌సీ స్టిక్కర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కే.పీ.బీ రాజు మంచాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ముజ్రాపార్టీ నిర్వహణ, సంబంధిత వ్యక్తుల సమాచారం తెలుసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని మాజీ ఎమ్మెల్యే సోదరుడు మధు గౌడ్, గత ఎన్నికల్లో నగరం నుంచి బీఆర్‌ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్‌తో పాటు మరో 22 మంది పార్టీకి హాజరైన వారిలో ఉన్నట్లు సమాచారం.