Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:16 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి...
న్యూఢిల్లీ, బంజారాహిల్స్, అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి(49)ని తమ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ బుధవారం జారీ చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయించినట్లు సోమవారం ’ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన దీపక్ రెడ్డికే తిరిగి టికెట్ కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర పార్టీ నాయకత్వం పట్టుబట్టింది. దీంతో అధిష్ఠానం దీపక్ రెడ్డికే టికెటు ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబరు 11న జరగనుంది. 14వ తేదీన ఫలితం వెలువడనుంది.