Heavy rains: శ్రీశైలం రాకపోకలకు అంతరాయం
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:54 AM
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగి రోడ్డుకు...
శ్రీశైలం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీనితో శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు బయల్దేరిన వాహనాలన్నీ చిక్కుకుపోయాయి. పోలీసులు గంటల తరబడి కష్టపడి భారీ రాళ్లు, మట్టిని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి తెలంగాణ, ఏపీ వైపు వెళ్లేందుకు రోడ్ క్లియరెన్స్ లేకపోవడంతో అటవీ అధికారులు బుధవారం ఉదయం నుంచి రాకపోకలను నిలిపివేశారు. అప్పటికే వసతి గదులు ఖాళీ చేసి తిరుగుముఖం పట్టిన యాత్రికుల వాహనాలు టోల్‌గేట్ వద్ద బారులు దీరాయి. బస్సులు నడవకపోవడంతో వందలాది మంది యాత్రికులు బస్టాండ్‌లోనే ఉండిపోయారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లను బస్టాండ్, ఔటర్ రింగ్‌రోడ్డు, శిఖరం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్దకు తరలించి యాత్రికులకు అందించారు. కొన్ని గంటల తర్వాత అధికారులు వాహనాలను అనుమతించారు. ఇక ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద కొండలపై నుంచి రాళ్లు జారిపడ్డాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లు, మూడు షాపులు ఽధ్వంసమయ్యాయి. పోలీసులు పరిశీలించి రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు సున్నిపెంట పూర్ణానంద ఆశ్రమం ప్రాంతంలోనూ పలు కాలనీలను వాన నీరు ముంచెత్తింది. ఆరో వార్డులోని ఒక రేషన్ షాపులో సుమారు 72 క్వింటాళ్ల బియ్యం తడిసిపోయింది.