Share News

వ్యవసాయ కళాశాలకు భూసేకరణ సర్వే పూర్తి

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:08 AM

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని మగ్దుమ్‌నగర్‌ ప్రాంతంలోని వ్యవసాయ కళాశాల నిర్మాణానికి భూసేకరణ సర్వే పూర్తి చేశారు.

వ్యవసాయ కళాశాలకు భూసేకరణ సర్వే పూర్తి
సర్వే వివరాలు పరిశీలిస్తున్న ఆర్డీవో శ్రీనివాసులు(ఫైల్‌)

కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం

బాధిత రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్‌ హామీ

హుజూర్‌నగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని మగ్దుమ్‌నగర్‌ ప్రాంతంలోని వ్యవసాయ కళాశాల నిర్మాణానికి భూసేకరణ సర్వే పూర్తి చేశారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీంతో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి మార్గం సుగుమమైంది. మగ్దుమ్‌నగర్‌లోని 1041 సర్వే నెంబర్‌లో వ్యవసాయ కళాశాల నిర్మించనున్నారు. రెండు నెలలుగా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు భూసేకరణకు సంబంధించి సర్వే చేశారు. 50ఏళ్లుగా సన్న, చిన్నకారు రైతులు 1041 సర్వే నెంబర్‌లో భూములు సాగు చేసుకుంటున్నారు. 270 మంది రైతులు తమ వివరాలు అధికారులకు అందజేశారు. ఆర్డీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో సర్వే పూర్తిచేశారు. వ్యవసాయ కళాశాలకు సేకరిస్తున్న భూమి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు అనేకసార్లు ధర్నాలు, రాస్తాకోరోలు నిర్వహించారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి నష్టపరిహారం విషయంలో న్యాయం చేయాలని అభ్యర్థించారు. బాధిత రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లోపే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1041 సర్వే నెంబర్‌లోని 270 ఎకరాలకు సంబంధించి మగ్దుమ్‌నగర్‌ గ్రామం సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉండగా మిగిలిన 230 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వ రైతుల నుంచి కొనుగోలు చేయనుంది.

భవన నిర్మాణానికి రూ.124 కోట్లు మంజూరు

వ్యవసాయ కళాశాల నిర్మాణానికి రూ.124 కోట్లు మంజూరు చేస్తూ గత నెల 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్‌నగర్‌ నుంచి మట్టపల్లి వెళ్లే రహదారి పక్కన మగ్దుమ్‌నగర్‌ గ్రామం కుడి, ఎడమ వైపు వ్యవసాయ భూములున్నాయి. పట్టణానికి అతి సమీపంలో ఉండడం, రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడంతో 1041 సర్వేలోని భూమి ఎంపికచేశారు. పాలకవీడు, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్ళచెరువు మండలాల్లో కళాశాల నిర్మించేందుకు అనేక స్థలాలు పరిశీలించిన అధికారులు చివరికి మగ్దుమ్‌నగర్‌లోని ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి, సర్వే పూర్తి చేశారు.

వ్యవసాయ కళాశాల భూసేకరణ సర్వే పూర్తి

హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని మగ్దుమ్‌నగర్‌లో వ్యవసాయ కళాశాల భూసేకరణకు సర్వే పూర్తి చేశాం. త్వరలోనే భూసేకరణపై నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందజేశాం. నోటిఫికేషన్‌ అనంతరం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రై తులకు పూర్తి న్యాయం చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

శ్రీనివాసులు, హుజూర్‌నగర్‌ ఆర్డీవో

Updated Date - Nov 25 , 2025 | 12:08 AM