Share News

New Railway Station: లగచర్లకు రైలు!

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:13 AM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల.. రాబోయే రోజుల్లో గేమ్‌చేంజర్‌గా మారనుంద..

New Railway Station: లగచర్లకు రైలు!

  • ఇండస్ట్రియల్‌ పార్కుకు సమీపంలో రైల్వేస్టేషన్‌ కొడంగల్‌ నియోజకవర్గంలోని తునికిమెట్ల వద్ద ఏర్పాటు

  • వికారాబాద్‌- కృష్ణా రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు

  • 120 కి.మీ. నుంచి 130.28 కి.మీ.కు పెరగనున్న దూరం

  • అంచనా వ్యయం 2వేల కోట్ల నుంచి 2,784.11 కోట్లకు పెంపు

  • ఈ నెలాఖరులోగా రైల్వే బోర్డుకు కొత్త అలైన్‌మెంట్‌ డీపీఆర్‌

వికారాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల.. రాబోయే రోజుల్లో గేమ్‌చేంజర్‌గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న లగచర్ల ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కు రోడ్డు రవాణా తదితర మౌలిక వసతులతోపాటు రైల్వే సదుపాయం కూడా రానుంది. వికారాబాద్‌ నుంచి కర్ణాటక సరిహద్దులోని కృష్ణా రైల్వేస్టేషన్‌ వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వేలైన్‌.. లగచర్ల మీదుగా వెళ్లనుంది. ఇందుకోసం.. రెండేళ్ల కిందట ప్రతిపాదించిన రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌లో రైల్వేశాఖ మార్పులు చేసింది. తొలుత వికారాబాద్‌ , పరిగి, కొడంగల్‌, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌, దమ్రుగూడ, నారాయణపేట, కున్సి మీదుగా కృష్ణా వరకు రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ మీదుగా ఈ రైల్వేలైన్‌ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసింది. ఇందుకు అనుగుణంగా అలైన్‌మెంట్‌ను మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వికారాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే రైల్వే లైన్‌ నస్కల్‌, పరిగి, తునికిమెట్ల, కొడంగల్‌, టేకుల్‌కోడ్‌, మద్దూరు, బాలంపేట, అన్నసాగర్‌, నారాయణపేట, మక్తల్‌ మీదుగా కృష్ణా వరకు కొనసాగనుంది. లగచర్ల మీదుగా పరిగి, కొడంగల్‌ మధ్యలో తునికిమెట్ల వద్ద కొత్తగా రైల్వే స్టేషన్‌ను ప్రతిపాదించారు. లగచర్ల ఇండస్ట్రియల్‌ పార్కుకు ఈ రైల్వే స్టేషన్‌ దగ్గర అవుతుంది.


పెరిగిన ప్రాజెక్టు వ్యయం...

ఇంతకుముందు వికారాబాద్‌ నుంచి కృష్ణా వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్‌ 120 కిలోమీటర్ల దూరం ఉండగా, రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కొత్తగా ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ ప్రకారం దూరం 130.28 కిలోమీటర్లకు, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,784.11 కోట్లకు పెరిగింది. అయితే 10.28 కిలోమీటర్ల దూరం మాత్రమే పెరిగినా.. ప్రాజెక్టు అంచనా వ్యయం మాత్రం ఒక్కసారిగా రూ.784.11 కోట్లు పెరిగిపోయింది. వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల అభివృద్ధికి దోహదపడే ఈ రైల్వే లైన్‌ డీపీఆర్‌ను ఈ నెలాఖరులోగా రైల్వే బోర్డుకు అందజేసేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, వికారాబాద్‌-కృష్ణా రైల్వేలైన్‌ ప్రాజెక్టుపై చేసే ఖర్చుతో పోలిస్తే.. రైల్వేశాఖకు వచ్చే ఆదాయం 11 శాతం లోపే ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. దీంతో ఇటీవల రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సందర్భంగా అలైన్‌మెంట్‌ మార్పుతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిన విషయాన్ని రైల్వే అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడం, రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (ఆర్వోఆర్‌) తక్కువగా ఉండడంతో భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంను కోరారు.

గోవాకు తగ్గనున్న దూరం

వికారాబాద్‌- కృష్ణా రైల్వేలైన్‌ పూర్తయితే.. వికారాబాద్‌ జిల్లా మీదుగా గోవాకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం గోవా వైపు వెళ్లాలంటే జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూలు, గుంతకల్‌, బళ్లారి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. అదే వికారాబాద్‌- కృష్ణా లైన్‌ పూర్తయితే ఈ మార్గంలోనే రాయచూర్‌, హుబ్బళ్లి నుంచి గోవా వెళ్లడానికి అవకాశం ఏర్పడడమే కాకుండా 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణికులకు దూరంతోపాటు ప్రయాణించే సమయం తగ్గిపోతుంది. వెనకబడిన కొడంగల్‌ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు కానున్న వికారాబాద్‌-కృష్ణా రైల్వేలైన్‌తో కొడంగల్‌ ప్రాంత ప్రజలకు మేలు జరగనుంది. ఎంతో కాలంగా రైల్వేలైన్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల్లో సర్వే పూర్తితో ఆశలు చిగురించాయి. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయంగా కొడంగల్‌కు వచ్చినప్పటి నుంచి రైల్వేలైన్‌, పరిశ్రమల ఏర్పాటుకు హామీలు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్నందున ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.

Updated Date - Sep 14 , 2025 | 05:14 AM