kumaram bheem asifabad- పోడు రైతుల సమస్యపై స్పష్టత కరువు
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:42 PM
పోడు రైతుల సమస్యపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైందని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని, జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలన్న ప్రధాన డిమాండుతో హరీష్‌బాబు సోమవారం తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పోడు రైతుల సమస్యపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైందని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని, జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలన్న ప్రధాన డిమాండుతో హరీష్‌బాబు సోమవారం తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. జీవో 49 కేవలం తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు ఈ నిరవధిక నిరహార దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేయటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు ఆర్మీశివకుమార్, మాజీ కౌన్సిలర్ సిందం శ్రీనివాస్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోడు రైతుల సమస్య పరిష్కరించాలని హరీష్ బాబు కాగజ్‌నగర్ అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపట్టగా, సోమవారం ఉదయం ఐదు గంటలకు పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు ఆర్మీశివకుమార్‌తో పాటు మాజీ కౌన్సిలర్లు, నాయకులను కెరమెరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరి పాటు ముట్టడికి విచ్చేస్తున్న నాయకులు, కార్యకర్తలను కాగజ్‌నగర్ డివిజన్ పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి సాయంత్రం వరకు పోలీస్‌స్షేషన్‌లో ఉంచి సొంత పూచికత్తుపై విడిచి పెట్టారు. అలాగే ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు రెండంచల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, నాయకులను ఎవరిని కూడా లోనికి పంపించలేదు.
భారీ బందోబస్తు..
ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సొమవారం అటవీ శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనుండటంతో కాగజ్‌నగర్ డివిజన్ పోలీసులు అటవీ శాఖ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యాలయానికి పర్లాంగు దూరంలో పోలీసులు క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి ఎవరిని కూడా అనుమంతించలేదు. ఈ కార్యాలయం సమీపంలోనే పాఠశాల ఉండడంతో విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు.