Share News

Lack of Aadhaar Keeps Migrant Children: అ, ఆ.. కు అడ్డంకిగా ఆధార్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:49 AM

బడిలో చేర్చుకోవాలంటే పిల్లలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి.. అంటూ పాఠశాలలు అనుసరిస్తోన్న విధానం పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన శ్రామికుల పిల్లల బాల్యాన్ని చిదిమేస్తోంది....

Lack of Aadhaar Keeps Migrant Children: అ, ఆ.. కు అడ్డంకిగా ఆధార్‌

  • ఆధార్‌ కార్డు లేక బడికి దూరమవుతున్న వలస శ్రామికుల పిల్లలు.. అమలుకు నోచుకోని విద్యా హక్కు చట్టం

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 66 వేల మందికి పైగా చిన్నారులు విద్యకు దూరమయ్యారని అంచనా

  • పరదా ఇళ్లలో, కూలి పనుల్లో ఒట్టిపోతున్న బాల్యం

  • నేడు బాలల దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): బడిలో చేర్చుకోవాలంటే పిల్లలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి.. అంటూ పాఠశాలలు అనుసరిస్తోన్న విధానం పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన శ్రామికుల పిల్లల బాల్యాన్ని చిదిమేస్తోంది. ఆధార్‌ లేదని పాఠశాలలు ఓనమాలు నేర్పబోమంటుంటే.. అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నాయి. ఆడుతూ పాడుతూ బడిబాట పట్టాల్సిన చిన్నారులు పొట్టకూటి కోసం పని బాట పడుతున్నారు. వెరసి హైదరాబాద్‌కు వలస వచ్చిన శ్రామికుల పిల్లల బాల్యం పరదా ఇళ్లలో, కూలీ పనుల్లో ఒట్టిపోతోంది.

ఒడిసా, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, ఏపీలోని కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఎన్నో కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వస్తుంటాయి. వీరిలో అత్యధిక శాతం మంది పటాన్‌చెరు, ఉప్పల్‌, నాచారం, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో దినసరి కూలీలుగా పని చేస్తూ చాలీచాలని సంపాదనతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. హైదరాబాద్‌లో దాదాపు 84వేల మంది వలస కార్మికులు ఉన్నారని కరోనా సమయంలో అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2లక్షలకు పైమాటే అని అమన్‌ వేదిక వంటి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఆ శ్రామికుల కుటుంబాలకు చెందిన పిల్లలు చాలామంది ఆధార్‌ కార్డులు లేక విద్యకు దూరమవుతున్నారు. ఎలాంటి పత్రాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా 14ఏళ్లలోపు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్చుకుని విద్య అందించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా హైదరాబాద్‌లో అది అమలు కావడం లేదు. బడిలో చేరాలంటే పిల్లలకు ఆధార్‌కార్డు తప్పనిసరి అని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో ఆధార్‌ కార్డులు లేక వలస కార్మికుల పిల్లలు చాలామంది బడికి దూరమవుతున్నారు.


ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో చదువుకు స్వస్తి చెబుతున్న వారు ఇంకొందరు ఉంటున్నారు. బడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో కొంత వయసు వచ్చే దాకా ఇంటిపట్టునే ఉంటున్న ఆ చిన్నారులు.. క్రమంగా చిత్తుకాగితాల సేకరణ, నిర్మాణ రంగ కూలీలుగా, ఇటుక బట్టీలు, గాజుల తయారీ, హోటళ్లలో పనికి వెళుతున్నారు. వలస శ్రామికుల జీవన పరిస్థితులపై పని చేసే అమన్‌వేదిక, మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్‌(ఎంవీఎ్‌ఫ), పౌరహక్కుల వేదిక వంటి సంస్థలు.. తగిన గుర్తింపు పత్రాలు లేక వలస కార్మికుల కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యకు దూరమవుతున్నారని వాపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో వలస శ్రామికుల పిల్లలు 70వేల మందికి మించి ఉంటారని వారిలో 95 శాతం మంది చదువుకు దూరంగా ఉన్నారని ఆ సంస్థల అంచనా.

పాఠశాలల్లో ప్రవేశానికి ఆధార్‌ ఎందుకంటే ?

యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌(యూడీఐఎ్‌సఈ) ప్రతి పాఠశాలకు ఒక కోడ్‌ను కేటాయిస్తుంది. విద్యార్థుల సమాచారం నమోదుకు జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఆన్‌లైన్‌ వ్యవస్థ ఇది. యూడీఐఎ్‌సఈలో నమోదైన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం నుంచి పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం వంటివి అందుతాయి. మరోపక్క, ప్రభుత్వ పథకాలు పొందడానికి, బదిలీ ప్రక్రియ సులభతరం కావడానికి, మార్కులు, విద్యార్హత పత్రాలు డిజిటల్‌ రూపంలో ఉంచడానికి ఆటోమేటెడ్‌ పర్మెనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(అపార్‌)లో విద్యార్థుల నమోదును కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అపార్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు అవసరం. దాంతో ఆధార్‌ కార్డు లేని పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోమని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. పోనీ ఆధార్‌తో సంబంధం లేకుండా పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో చదువు చెప్పించే అవకాశం ఉన్నా తల్లిదండ్రులకు అంత స్థోమత ఉండడం లేదు.


ఆ పిల్లలకు ఆధార్‌ అంత సులభం కాదు..

పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు తమ పిల్లలకు ఆధార్‌ పొందడం అంత సులభమేమీ కాదు. ఆధార్‌కార్డు పొందడానికి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. బిహార్‌, ఒడిసా, యూపీ, మహారాష్ట్రలోని మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన వారిలో చాలామంది మహిళల కాన్పులు వారి స్వస్థలంలోని తమ ఇళ్ల దగ్గరో, గుర్తింపులేని ఆస్పత్రుల్లోనో జరుగుతుంటాయి. దాంతో పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు ఉండడం లేదు. జనన ధ్రువీకరణ పత్రం పొందేందుకు కావాల్సిన పత్రాలు కూడా అతికొద్ది మంది వద్దే ఉంటున్నాయి. దీంతో పిల్లలకు ఆధార్‌ లభించడం లేదు. మరోపక్క, పిల్లల చదువు విషయంలో వలస కూలీలకు ఎదురవుతున్న సమస్యను ఆసరాగా చేసుకొని.. పిల్లలకు ఆధార్‌ కార్డులు ఇప్పిస్తామంటూ అందినకాడికి దోచుకుంటున్న వ్యక్తులు కూడా ఉంటున్నారు.

1.jpg

ప్రత్యేక ఆధార్‌ నమోదు కేంద్రాలు అవసరం

బిహార్‌, యూపీ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన శ్రామికులు చాలామంది బండ్లగూడ ప్రాంతంలోని పది బస్తీలలో ఉంటున్నారు. తమ పిల్లలకు ఆధార్‌ కార్డులు లేక పాఠశాలలకు పంపలేకపోతున్నామని ఆయా కుటుంబాలు వాపోతున్నాయి. కూలీ పని పక్కన పెట్టి గుర్తింపు పత్రాల కోసం తిరిగే పరిస్థితి ఆ కుటుంబాలకు లేదు. అందువల్ల హైదరాబాద్‌లో వలస కూలీలు నివసించే ప్రాంతాల్లో ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఆధార్‌ కార్డులు జారీ చేయాలి. ఆ లోపు ఆధార్‌తో సంబంధం లేకుండా పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలి.

- సంగీత, ఎంవీఎఫ్‌ కార్యకర్త

Updated Date - Nov 14 , 2025 | 04:49 AM