Two Accidents, Two FIRs: 2 ప్రమాదాలు.. 2 ఎఫ్‌ఐఆర్‌లు!
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:56 AM
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై దర్యాప్తు చివరి దశకు చేరింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఎన్.రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్...
కర్నూలు బస్సు ప్రమాద బాధితుడు రమేశ్ ఫిర్యాదు.. వేమూరి కావేరి ట్రావెల్ బస్ డ్రైవర్, ఓనర్‌పై కేసు
ఎర్రిస్వామి ఫిర్యాదుతో మృతుడు శివశంకర్‌పై కేసు
గురువారం రాత్రి 8.25 గంటలకు దుకాణంలో మద్యం కొనుగోలు చేసిన శివశంకర్, ఎర్రిస్వామి
కర్నూలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై దర్యాప్తు చివరి దశకు చేరింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఎన్.రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్, యజమానిపై ఉల్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు ప్రమాదానికి పది నిమిషాలు ముందే అంటే అర్ధరాత్రి 2:45 గంటల సమయంలో మద్యం మత్తులో బైక్‌పై డోన్‌కు వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామి డివైడర్‌ను ఢీకొట్టారు. శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు. రోడ్డు మధ్యలో పడిపోయిన వీరి బైక్ బస్సు ప్రమాదానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చనిపోయిన బి.శివశంకర్‌పైనా కేసు నమోదు చేశారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, కర్నూలు తాలుకా సీఐ చంద్రబాబునాయుడు దర్యాప్తు వేగవంతం చేశారు.
కాటేసిన మద్యం మత్తు
శివశంకర్, ఎర్రిస్వామి అలియాస్ నాని మిత్రులు. కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామం వద్ద జాతీయ రహదారికి 240 మీటర్ల దూరంలో ఉన్న రేణుక యల్లమ్మ మద్యం దుకాణంలో గురువారం సాయంత్రం 6:57 గంటలకు ఒకసారి, రాత్రి 8:25 గంటల సమయంలో మరోసారి వీరు మద్యం కొనుగోలు చేశారు. షాపు నుంచి బయటకు వచ్చిన తర్వాత 8:27 గంటలకు వీరు బైక్‌పై వెళ్లిపోయిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమరాలో రికార్డయ్యాయి. ఆ తరువాత అర్ధరాత్రి 2:25 గంటల సమయంలో చిన్నటేకూరు గ్రామం దగ్గర కియ షోరూంకు ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్లి 2:45 గంటలకు డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు. మద్యం మత్తులో వీరు డివైడర్‌ను ఢీకొట్టిన బైకే.. ఆ తరువాత జరిగిన బస్సు ప్రమాదానికి కారణమైంది. లక్ష్మీపురం గ్రామంలో ఎర్రిస్వామి తల్లి ఉంటున్నారు. మద్యం తాగిన వారిద్దరూ ఇంటికి వెళ్లి పడుకున్నారు. రాంపల్లిలో ఎర్రిస్వామికి తెలిసినవారి వివాహం ఉండటంతో తనను ఆర్టీసీ బస్టాండ్‌లో దించమని కోరారు. అయితే డోన్‌లో రైళ్లు ఉంటాయని, వద్దని చెప్పినా వినకుండా శివశంకర్ బలవంతంగా బైక్‌పై డోన్ వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
శివశంకర్ నమూనాల్లో మద్యం ఆనవాళ్లు: ఎస్పీ
చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను డివైడర్‌కు ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన బి.శివశంకర్ మద్యం తాగినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘శివశంకర్ నుంచి సేకరించిన నమూనాల్లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఆర్‌ఎ్‌ఫఎ్‌సఎల్ నివేదికలో నిర్ధారించారు. మృతుడు మద్యం తాగి బైక్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగింది. ఆ తరువాత రోడ్డు మధ్యలో పడిన బైక్‌ను వి.కావేరి ట్రావెల్ బస్సు తోసుకొని వెళ్లింది. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ పేర్కొన్నారు.