Share News

KTR Warns of a New Political Storm: జూబ్లీ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుపాను!

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:31 AM

జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కొత్త తుపాను రాబోతోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు....

KTR Warns of a New Political Storm: జూబ్లీ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుపాను!

  • 4 లక్షల మంది ఓట్లతో 4 కోట్ల మందికి మేలు

  • మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్‌ దిమ్మ తిరగాలి

  • ఎగురుతున్న వాళ్లందరి తోకలు కత్తిరిస్తాం

  • ఆకు రౌడీలను రేవంత్‌ కూడా కాపాడలేడు

  • ఎర్రగడ్డ రోడ్‌షోలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ/ఎర్రగడ్డ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కొత్త తుపాను రాబోతోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు గట్టిగా బుద్ధి చెప్పాలి. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్‌ నేతల దిమ్మ తిరగాలి’’ అని జూబ్లీహిల్స్‌ ఓట్లరకు పిలుపునిచ్చారు. నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్‌ ప్రజల తీర్పుతో నాలుగు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మేలు జరగబోతోందని వ్యాఖ్యానించారు. మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు ఎవరెవరు ఎగురుతున్నారో వారందరి తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్‌ షోల్‌ కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘దార్లో యూసు్‌ఫగూడ జంక్షన్‌లో కారు ఆగితే పక్కన నిలబడిన ఆటో డ్రైవర్‌ మహమూద్‌తో మాట్లాడా. మహమూద్‌ భాయ్‌ ఎట్లుంది కాంగ్రెస్‌ పాలన? అంటే.. రెండేళ్ల నుంచి మొత్తం నాశనమైందని చెప్పాడు. కేసీఆర్‌ ఉన్నప్పుడు రోజుకు రెండు వేలు సంపాదించేవాడు. అందులో వెయ్యి మిగిలేవి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు వెయ్యి వస్తే ఆటో కిరాయి, ఇంటికి, పిల్లల ఫీజులకు కూడా సరిపోవడం లేదని చెప్పాడు’’ అన్నారు. ఒక్కసారి తప్పు చేస్తే ఐదేళ్లు అనుభవించాల్సిదేనని చెప్పానని, ఇప్పుడేమైనా చేయొచ్చా? అని అడిగాడని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రె్‌సను ఓడించి ఆ పార్టీ నాయకులకు బుద్థి చెప్పడమే సరైన పరిష్కారమని సూచించానని కేటీఆర్‌ తెలిపారు.


ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్‌ఎస్‌ లీడర్‌ షరీ్‌ఫను బలవంతంగా తీసుకెళ్లి కాంగ్రెస్‌ కండువా కప్పారని, టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను అడ్డం పెట్టుకుని నేతలపై దౌర్జన్యం చేస్తూ తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు. హిట్లర్‌ వంటి నియంతేపతనమయ్యాడు, రేవంత్‌ ఎంత? అని ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్‌ ప్రజలను ఎలా చూసుకున్నారో, ఎలాంటి మంచి పనులు చేశారో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్‌ హయాంలో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయని, ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పారు. హోటళ్లు, చిరు వ్యాపారాలు బాగా నడిచాయని, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ నాశనయ్యాయని అన్నారు. కాంగ్రెస్‌ 420 అబద్దపు హామీలు ఇచ్చిందని, ఒక్కటి కూడా అమలు కాలేదని చెప్పారు. రేవంత్‌ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిండు? ఒక్కరినైనా చేశాడా? అని ప్రశ్నించారు. పేదలు కష్టపడి కొనుక్కున్న ప్లాట్ల ధరలు కూడా పడిపోయాయని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో వేల ఇండ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కడితే హైడ్రా ఆయన జోలికి వెళ్లదని, మంత్రులు పొంగులేటి, వివేక్‌, పట్నం మహేందర్‌రెడ్డి ఇళ్లు చెరువులో కడితే వారిని ఏమనరని, పేదల ఇళ్లను మాత్రం కూలగొడతారని మండిపడ్డారు. 800 మంది రైతులు, 109 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేసీఆర్‌ పథకాలను రేవంత్‌ ఆపేశాడని, పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలివరకు అందరినీ మోసం చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అరాచకాలకు భయపడుతున్న ప్రజలు కేసీఆర్‌ రావాలి అని అడుగుతున్నారని కేటీఆర్‌ చెప్పారు. కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక అని వ్యాఖ్యానించారు. కత్తి కాంగ్రె్‌సకు ఇచ్చి బీఆర్‌ఎ్‌సను యుద్థం చేయమంటే కష్టమని, కత్తి మాకు ఇస్తే కాంగ్రె్‌సతో పోరాడుతామని, మీ ఇళ్లపైకి బుల్డోజర్‌ వస్తే అడ్డంగా పడుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ఓటుకు రూ.5 వేలు, రూ.6 వేలు ఇస్తున్నారని, యూసు్‌ఫగూడలో ఏకంగా రూ.8 వేలు కూడా ఇస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు డబ్బులు ఇస్తే తీసుకుని బీఆర్‌ఎ్‌సకు ఓటేయాలని కోరారు. ఇప్పుడు నకరాలు చేసే ఆకు రౌడీలను ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని, ఎవడు తోక జాడించినా కత్తిరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరెవరు ఎగిరిపడుతున్నారో వారిని రేవంత్‌రెడ్డి కూడా రక్షించలేరని హెచ్చరించారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌ ఓడిపోతోందని చెప్పగానే అజారుద్దీన్‌ను మంత్రిని చేశారని, జూబ్లీహిల్స్‌లో ఓడిస్తే అధికారాన్ని కాపాడుకొనేందుకు రేవంత్‌రెడ్డి హామీలన్నీ అమలు చేస్తాడని అన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 02:31 AM