Share News

KTR: నవీన్‌యాదవ్‌ ఆకు రౌడీ

ABN , Publish Date - Nov 01 , 2025 | 05:12 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన నవీన్‌యాదవ్‌ ఓ ఆకురౌడీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: నవీన్‌యాదవ్‌ ఆకు రౌడీ

  • అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరినీ బెదిరిస్తారు.. జూబ్లీహిల్స్‌ ప్రజలు అప్రమత్తంగా ఓటెయ్యాలి: కేటీఆర్‌

  • మీ తీర్పు తెలంగాణ గోస తీర్చాలి

  • కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి

  • రెండేళ్లలో ఒక్కరికైనా మేలు జరిగిందా?

  • షేక్‌పేట రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌/సిటీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన నవీన్‌యాదవ్‌ ఓ ఆకురౌడీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఇప్పుడే అందరినీ భయపెడుతున్న ఆయన్ను పొరపాటున గెలిపిస్తే.. టీస్టాల్‌ వాళ్లు సహా అందరినీ బెదిరిస్తారని చెప్పారు. అతను ఎమ్మెల్యే అయితే ఎంతో ప్రమాదకరమన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు తెలివిగా ఆలోచించి, ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. మజ్లిస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో, షేక్‌పేటలో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రజల్ని బెదిరిస్తున్నారని, వారికి ఎవరూ భయపడొద్దని, బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలని, కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తాం.. అంటూ ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్‌.. ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజలకు ఎంతో బాకీ పడిందని, ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ డబ్బులు ఇస్తే.. తీసుకొని మిగతా డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని చెప్పారు. పేదల ఇళ్లను కూలగొట్టిన బుల్డోజర్‌ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.


మీ తీర్పు తెలంగాణ గోస తీర్చాలి..!

అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపిస్తామంటూ 420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రె్‌సకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ కోరారు. నియోజకవర్గంలోని నాలుగు లక్షల ఓటర్ల తీర్పు.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల గోస తీర్చేలా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోతేనే ఇచ్చిన హామీలు అమలవుతాయని, పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే.. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని, ప్రజలను పట్టించుకోడని అన్నారు. శుక్రవారం రాత్రి కేటీఆర్‌ షేక్‌పేటలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ చావు నోట్లో తలపెడితే వచ్చిన రాష్ట్రానికి నాడు రూ.85 వేల కోట్ల అప్పు ఉండేదని, సంపద పెంచి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెట్టామని చెప్పారు. కేసీఆర్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగించే తెలివి ఈ సర్కారుకు లేదన్నారు. రెండేళ్లలో ఈ సర్కారు వల్ల ఒక్కరికైనా మేలు జరిగిందా..? అన్నది ఆలోచించాలని కోరారు. ఓటమి భయంతో కాంగ్రెస్‌ ఆపద మొక్కులకు పోతున్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని మైనారిటీల నుంచి సినీ కార్మికుల వరకు అందరికీ ఏదో చేస్తామంటూ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఆ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి..

జూబ్లీహిల్స్‌లో గోపీనాథ్‌ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారని, దురదృష్టవశాత్తు అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరమని కేటీఆర్‌ అన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం మీ ముందుకు వచ్చిందని, ఆ ఇంటి ఆడబిడ్డను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘మీ జోష్‌ చూస్తుంటే విజయం మనదే అని తెలుస్తోంది. తేలాల్సింది మెజారిటీ మాత్రమే’ అని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ మళ్లీ కావాలంటే జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Nov 01 , 2025 | 05:13 AM