KTR Warns: సర్పంచులను వేధిస్తే సహించం
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:59 AM
ఎన్నికైన కొత్త సర్పంచ్‌లను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.....
ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు: కేటీఆర్
హైదరాబాద్/ సిరిసిల్ల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికైన కొత్త సర్పంచ్‌లను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో జిల్లాలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను సోమవారం ఆయన సన్మానించి అభినందించారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడొద్దని ‘బీఆర్‌ఎస్ మద్దతుదారు సర్పంచ్’లకు భరోసా కల్పించారు. ‘మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. ఇబ్బంది పెడతామని అధికారులైనా, పాలకపక్ష నేతలైనా బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. అర్థగంటలో మీకు పార్టీ యంత్రాంగం అండగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలతో కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని చిధ్రం చేస్తున్న రేవంత్‌రెడ్డికి పంచాయతీ ఎన్నికలు చెంపపెట్టువంటివని పేర్కొన్నారు.