Share News

ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులూ.. స్థానిక ఎన్నికలను బహిష్కరించండి: కేటీఆర్‌

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:46 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధితులు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులూ.. స్థానిక ఎన్నికలను బహిష్కరించండి: కేటీఆర్‌

కాంగ్రెస్‌ కూల్చిన ఇళ్లను కట్టిస్తానని హామీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధితులు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్‌, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను బహిష్కరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చి పేదలు, రైతుల జీవితాలను ఆగం చేస్తోందన్నారు. కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి హైడ్రాను అడ్డుపెట్టుకొని బుల్డోజర్‌ పాలన సాగిస్తున్నారని, పేదల ఇళ్లు కూల్చి పెద్దలను మాత్రం వదిలేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం సోదరుడు, మంత్రులు పొంగులేటి, వివేక్‌ వంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల భూముల్లో ఇళ్లు కట్టుకున్నా హైడ్రా కూల్చడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ బోరబండ డివిజన్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ కూల్చిన ఇళ్లను కట్టించి ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. మొన్నటిదాకా జనం రక్తం తాగి.. ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పండగ చేసుకొమ్మంటే ఎలా అని ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్‌ ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల కష్టానికి ప్రభుత్వం తగిన ఫలితం ఇవ్వకపోవడం దారుణమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు విమర్శించారు. వారికిచ్చే లాభాల్లో 50 శాతానికి పైగా కోత విధిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి పండగపూట చేదు కబురు చెప్పారన్నారు. సింగరేణి సంస్థ మొత్తం రూ.6,394 కోట్ల లాభాలు గడిస్తే.. కేవలం రూ.2,360 కోట్లలో 34 శాతం బోనస్‌ ఇవ్వడం ఏమిటని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వచ్చిన లాభంలో మూడో వంతు పక్కనపెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గమన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 06:47 AM