Share News

TRS working president K.T. Rama Rao: కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. రేవంత్‌ గుండె ఆగి చస్తారు

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:54 AM

కేసీఆర్‌ బయటకు రావాలని కాంగ్రెస్‌ నేతలు పదే పదే అంటున్నారు. ఆయన ఒక్క మీటింగ్‌, ప్రెస్‌మీట్‌ పెడితేనే ముచ్చెమటలు పట్టి, చలి జ్వరం వచ్చింది..

TRS working president K.T. Rama Rao: కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. రేవంత్‌ గుండె ఆగి చస్తారు

  • ముఖ్యమంత్రిని కొడంగల్‌లోనే గెలవనివ్వం.. అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టనివ్వం: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ బయటకు రావాలని కాంగ్రెస్‌ నేతలు పదే పదే అంటున్నారు. ఆయన ఒక్క మీటింగ్‌, ప్రెస్‌మీట్‌ పెడితేనే ముచ్చెమటలు పట్టి, చలి జ్వరం వచ్చింది. ఇక, కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే రేవంత్‌ రెడ్డి గుండె ఆగి చస్తారు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తన తండ్రిని తిడుతున్నందుకు తనకు చాలా కోపంగా ఉందని, రేవంత్‌ దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకుని కొట్టాలని ఉందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గుంటూరులో చదివితే తప్పేమిటని ప్రశ్నించారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పంటున్నారని, ఆయన మాత్రం ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. మరి రేవంత్‌ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా? అంటూ వ్యంగ్యంగా అన్నారు. ‘‘అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి. అలాగే నేను చేసుకుంటే తప్పా? రేవంత్‌లా దొంగ పనులు చేయలేదు. రోజూ తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిది ఏం భాష? టీవీ పెడితే అన్నీ బూతులే. పిల్లలు చెడిపోతున్నారని ప్రజలు టీవీలను కట్టేసే పరిస్థితి దాపురించింది’’ అని మండిపడ్డారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వనని రేవంత్‌ అంటున్నారని, ఆయనను కొడంగల్‌లోనే గెలవనివ్వమని, మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని ప్రతినబూనారు. తాను తన తండ్రి పేరు చెప్పుకుంటున్నానని పదే పదే అంటున్నారని, తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. వారిలా ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాం లా బతకబోమని, తెలంగాణ పౌరుషంతో బతుకుతామని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడానికి ముఖం లేదని, కానీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం పేరు ఎనుముల రేవంత్‌ రెడ్డి కాదని, ఎగవేతల రేవంత్‌ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రె్‌సలో చేరి, స్పీకర్‌కు మాత్రం బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నామని చెబుతున్నారని, స్పీకర్‌ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ర్టునిలా తయారయ్యారని మండిపడ్డారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ ‘పేరేమో గాంధీ.. చేసేవి మాత్రం గాడ్సే పనులు, భూ కబ్జాలు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ దయతో అరికెపూడి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. నిజమైన మార్పు ఇప్పటికే గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రారంభమైందని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Updated Date - Dec 27 , 2025 | 03:54 AM