KTR Slams Revanth Reddy: రేవంత్ అసమర్థతతో..కంపెనీలు తరలిపోతున్నాయి
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:02 AM
రాష్ట్రంలో చెత్త సర్కార్ నడుస్తోందని.. మున్సిపల్, ఆరోగ్యశాఖల సమన్వయ లోపం వల్ల మురుగునీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ సహా పట్టణాలన్నీ కంపుకొడుతున్నాయని బీఆర్‌ఎస్..
రాష్ట్రం ఆటోపైలట్ మోడ్‌లో కాదు...
ఆటో డిస్ట్రక్షన్ మోడ్‌లోకి వెళ్లింది: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చెత్త సర్కార్ నడుస్తోందని.. మున్సిపల్, ఆరోగ్యశాఖల సమన్వయ లోపం వల్ల మురుగునీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ సహా పట్టణాలన్నీ కంపుకొడుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని.. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని సోమవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ప్రజలు సమస్యలతో అలమటిస్తుంటే పాలకులు మాత్రం ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనతో తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రానికి తెచ్చిన ‘కేన్స్ టెక్నాలజీ’ సెమీకండక్టర్ల పరిశ్రమ గుజరాత్‌కు తరలిపోవడం బాధాకరమని చెప్పారు. రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణ ప్రగతి ‘ఆటో డిస్ట్రక్షన్ (స్వయం విధ్వంసక)’ మోడ్‌లోకి వెళ్లిపోయింది. పదేళ్లపాటు కష్టపడి నిర్మించిన బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ప్రతిష్ఠను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది..’’ అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణను ఢిల్లీ పెద్దలకు ఏటీఎంగా మార్చి, ఇక్కడి సంపదను వారికి దోచిపెట్టడమే కాంగ్రెస్ సర్కార్ ఎజెండాగా మారిందని ఆరోపించారు. వేల కోట్ల ముడుపులు తీసుకుని బడా కాంట్రాక్టర్లకు, క్యాబినెట్‌లోని మంత్రుల కంపెనీలకు బిల్లులు చెల్లిస్తున్నారని.. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.