Share News

BRS working president KTR: 500 రోజులు ఆగితే కేసీఆర్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:46 AM

మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు అరాచకానికి పాల్పడుతోందని, ఎంతో మంది గూడు కోల్పోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌....

BRS working president KTR: 500 రోజులు ఆగితే కేసీఆర్‌ ప్రభుత్వం

  • హైడ్రా అరాచకాలకు పాల్పడుతోంది.. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి కూల్చేస్తోంది

  • మంత్రులు పొంగులేటి, వివేక్‌ ఇళ్లు చెరువుల్లోనే ఉన్నాయి

  • రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లూ బఫర్‌ జోన్‌లోనే..

  • కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: కేటీఆర్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు అరాచకానికి పాల్పడుతోందని, ఎంతో మంది గూడు కోల్పోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేేస బాధ్యత తనదని, 500 రోజులు ఆగితే కేసీఆర్‌ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. హైడ్రా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘పెద్దోళ్లకు ఓ న్యాయం.. పేదలకు ఒక న్యాయం’ పేరిట ఆదివారం తెలంగాణభవన్‌లో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. హైడ్రా అరాచకాలకు పాల్పడుతోందంటూ కేటీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ హయాంలో ఎక్కడచూసినా కట్టడాలే కనిపిస్తాయి. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించాం. అమెరికా వైట్‌హౌ్‌సను తలదన్నేలా రాష్ట్ర సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, 42 ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు ఇలా ఎన్నో నిర్మించాం. కానీ రేవంత్‌రెడ్డి గత రెండేళ్లలో కూలగొట్టడమే తప్ప కొత్తగా నిర్మించిందేమీ లేదు. హైడ్రాపై భట్టి విక్రమార్క ఇచ్చిన ప్రజంటేషన్‌లో చాలామంది బిల్డర్ల పేర్లు చెప్పారు. వారెవరినీ ఇబ్బంది పెట్టలేదు. కానీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి కూలగొట్టి, వారికి నీడలేకుండా చేశారు. కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్న కొందరికి గతంలో ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా వారిని కూడా వెళ్లగొట్టింది. హైడ్రా చేేసది న్యాయమే అయితే.. ముందుగా నోటీసులు ఎందుకు ఇవ్వరు, బాధితులు చూపుతున్న పేపర్లను ఎందుకు పరిశీలించరు? ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెరువును పూడ్చి ఇల్లుకట్టారు. మరో మంత్రి వివేక్‌ కూడా హిమాయత్‌సాగర్‌ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ లోపల ఇల్లుకట్టారు. వారి ఇళ్లను కూల్చేదమ్ము హైడ్రాకు ఉందా?’’ అని కేటీఆర్‌ నిలదీశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెరువుల్లోనే ఇళ్లు కట్టుకున్నారని, వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. కాగా, బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్‌ నవతారెడ్డి ఆదివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపుతోనే కాంగ్రెస్‌ అరాచకాలకు అంతమని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ నోట్లతో ఓట్లు కొనాలనుకుంటోంది

విద్యావంతులు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండడం బాధాకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒక్కరు ఓటు వేయకున్నా కాంగ్రెస్‌ రిగ్గింగ్‌ చేసి ఆ ఓట్లు వేసుకుంటుందని ఆరోపించారు. ఆదివారం షేక్‌పేటలోని ఆదిత్య ఇంప్రెస్‌, సత్వ గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్‌ మాట్లాడారు. తాము పదేళ్లలో పేదల కోసం, హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. మరోవైపు.. కాంగ్రెస్‌ గూండాలు మణుగూరు బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి చేసి, దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లా డి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన మొదలైన నాటి నుంచి గూండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.

Updated Date - Nov 03 , 2025 | 03:46 AM