Share News

KTR Slams Revanth Reddy: రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది!

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:13 AM

రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం..

KTR Slams Revanth Reddy: రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది!

  • రాష్ట్రాన్ని దోచుకుంటున్న రేవంత్‌రెడ్డి కుటుంబం, మంత్రులు: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం, మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హోటల్స్‌ యూనియన్‌ కార్మిక నాయకులు పలువురు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన కార్మికులను బీఆర్‌ఎస్‌ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారని.. ఆ సమయంలో మంత్రి కూతురు బయటకు వచ్చి తుపాకీ ఇచ్చిందే రేవంత్‌రెడ్డి అని చెప్పారని అన్నారు. మంత్రి భర్తే తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారని చెప్పారు. అలీబాబా దొంగల ముఠా లాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన తయారయిందని కేటీఆర్‌ విమర్శించారు. లిక్కర్‌ బాటిళ్ల స్టిక్కర్‌ కాంట్రాక్టు కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీపడ్డారని.. ఈ వ్యవహారంలో ఎవరికీ చెప్పలేక ఓ ఐఏఎస్‌ అధికారి రాజీనామా చేశారని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న వాళ్లను, బెదిరింపులకు పాల్పడే వాళ్ళను గెలిపిస్తారా...? అని ప్రశ్నించారు. కాగా, జహీరాబాద్‌ మైనార్టీ గురుకులంలో చదివి వైద్య కళాశాలల్లో సీట్లు సాధించిన ఎంబీబీఎస్‌ విద్యార్థులను కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు సత్కరించారు. జహీరాబాద్‌ గురుకులం నుంచి మాత్రమే 16 మంది ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. కాగా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 29న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నట్లు బీఆర్‌ఎ్‌సవిద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 02:13 AM