BRS Executive President K.T. Rama Rao: ఇది సర్కారా? రౌడీ దర్బారా?
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:07 AM
రాష్ట్రంలో నడుస్తున్నది సర్కారా? లేక రౌడీ దర్బారా అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని ప్రజలు అడిగితే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీశారు. ‘‘ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే నిరుద్యోగులను..
హామీలు అమలు చేయాలంటే.. పథకాలు ఆపేస్తానని బెదిరిస్తారా?
రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే విద్యా సంస్థలను భయపెడతారా?
పదేళ్ల అభివృద్ధి, అరాచకానికి మధ్యే పోటీ
హైడ్రా బుల్డోజర్‌ను అడ్డుకునేది కారు పార్టీ మాత్రమే: కేటీఆర్
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నడుస్తున్నది సర్కారా? లేక రౌడీ దర్బారా అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని ప్రజలు అడిగితే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీశారు. ‘‘ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే నిరుద్యోగులను.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వమంటే విద్యాసంస్థల నిర్వాహకులను, రిటైర్మెంట్ ప్రయోజనాలు కావాలన్న ఉద్యోగులను.. ఇలా అందరినీ బెదిరిస్తున్నారు. నువ్వు నడుపుతున్నది సర్కారా? రౌడీ దర్బారా రేవంత్?’’ అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా మంగళవారం సోమాజిగూడలో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. తల్లిదండ్రులను బాగా చూసుకోకుంటే జీతంలో కోత పెడతానంటున్న రేవంత్.. తల్లిదండ్రుల్లాంటి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ నిలదీశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించని ఈ సర్కారు జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తుందంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అభివృద్ధికి, కాంగ్రెస్ రెండేళ్ల అరాచకానికి మధ్య పోటీ ఇదని పేర్కొన్నారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని చెప్పారు. రైతుబంధు, దళతబంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు.. ఇలా అన్ని పథకాలను రేవంత్‌రెడ్డి బంద్ చేశారని.. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం ఉచిత తాగునీటి సరఫరా బంద్ అవుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ, రేవంత్ మాటలు నమ్మిన విద్యార్థులు ఊరూరా తిరిగి కాంగ్రె్‌సకు మద్దతుగా ప్రచారం చేశారని.. కానీ రెండేళ్లలోనే అదే విద్యార్థులు కాంగ్రె్‌సకు ఓటు వేయవద్దని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు పరిస్థితి మారిందని.. హైడ్రా భూతం పేదలను బయటికి గెంటివేసి ఇళ్లను కూలగొడుతోందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా పేదలకేనా, పెద్దలకు వర్తించదా అని ప్రశ్నించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో రేవంత్‌రెడ్డి అన్న ఇల్లు, గండిపేటలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి భవనాలు ఉన్నాయని.. వారి జోలికి వెళ్లని హైడ్రా పేదల ఉసురు మాత్రం తీస్తోందని మండిపడ్డారు. బుల్డోజర్‌ను అడ్డుకునేది కారు పార్టీ మాత్రమేనని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతమని రేవంత్‌రెడ్డికి అర్థమైందని, అందుకే దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు, తర్వాత హైడ్రా కూల్చివేతలు, బాధితుల ఆవేదన వీడియోలను కేటీఆర్ ప్రదర్శించారు. కాగా, బస్సు ప్రమాద మృతులను టోయింగ్ వాహనంలో తరలించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పేద కుటుంబాల వారికి మరణంలోనూ కనీస గౌరవం దక్కకపోవడం బాధాకరం. మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వపరంగా వాహనాలు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గం. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్తవ్యాన్లు, టోయింగ్ వాహనాల్లో మృతదేహాలను తరలించాల్సిరావడం ఆవేదన కలిగిస్తోంది’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.