KTR Slams Congress and BJP: దేశ ద్రోహి కాంగ్రెస్.. ప్రజా ద్రోహి బీజేపీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:38 AM
దేశ ద్రోహి కాంగ్రెస్.. ప్రజా ద్రోహి బీజేపీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోంది.....
యూరియా అడిగితే రైతులపై థర్డ్ డిగ్రీనా?
ఇదేనా రాహుల్ చెప్పిన మొహబ్బత్ కీ దుకాణ్
జీఎస్టీ పేరిట మోదీ రూ.15 లక్షల కోట్లు దోచుకున్నందుకు పండుగ చేసుకోవాలా?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశ ద్రోహి కాంగ్రెస్.. ప్రజా ద్రోహి బీజేపీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోంది. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం కరీంనగర్‌కు చెందిన డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డిలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోదీ.. ఇప్పుడు బిహార్ ఎన్నికల కోసం జీఎస్టీ శ్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని విమర్శించారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని, యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో కొట్టిస్తున్నారని, సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఈ అంశాన్ని ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అంటే రైతులను కొట్టడమేనా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ బృందం సభ్యులు బుధవారం కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్స్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పీపుల్స్ ప్లాజాలో బీఆర్‌ఎస్ బతుకమ్మ వేడుకలు
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని, పద్మారావు గౌడ్, సత్యవతి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వాణిదేవి, ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు.