KTR Slams CM Revanth Reddy: బీసీల గొంతు కోసిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:47 AM
బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 42శాతం...
స్థానిక ఎన్నికల్లో 42ు రిజర్వేషన్ పేరిట మోసం.. 24ు రిజర్వేషన్‌ను 17 శాతానికి తగ్గించారు
దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహల్ స్పందించగలరా?
ఫ్యూచర్ సిటీ పేరిట 5లక్షల కోట్ల దోపిడీకి యత్నం: కేటీఆర్
హనుమకొండ టౌన్/జనగామ/గీసుగొండ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 42శాతం రిజర్వేషన్ల అంటూ బీసీలను మోసగించిన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన 24శాతం రిజర్వేషన్‌ను 17శాతానికి తగ్గించారని మండిపడ్డారు. కులగణన పేరిట రూ.160కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని ధ్వజమెత్తారు. పార్టీతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో... పార్టీ పరంగా బీసీలకు ఎలా రిజర్వేషన్లు ఇస్తారని ప్రశ్నించారు. ఈ మోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పందిస్తారా? అని నిలదీశారు. హనుమకొండ, జనగామలో బుధవారం నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం గీసుగొండ మండలంలోని టెక్స్‌టైల్ పార్కులో ఉన్న కైటెక్స్ వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై తెలంగాణ అననోడు సీఎం అయ్యాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అవినీతి అనకొండలా మారారని, ఫ్యూచర్ సిటీ పేరుతో రూ.5లక్షల కోట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను రాహుల్‌గాంధీకి పేటీఎం, ఏటీఎంలా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పలు పారిశ్రామిక వాడలకు గతంలో కేటాయించిన 9300 ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ దెబ్బకు సీఎం, డిప్యూటీ సీఎం జూబ్లీహిల్స్ గల్లీల్లో తిరిగారని, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. జూబ్లీహిల్స్ గెలుపును సీఎం రేవంత్‌రెడ్డి బలుపుగా భావిస్తే.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని సవాల్ విసిరారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటైన కైటెక్స్, యంగ్‌వన్, గణేషా కంపెనీలతో వేల మందికి ఉపాధి లభిస్తోందని, కేసీఆర్ కల సాకారమైందని అన్నారు. కాగా, హనుమకొండలోని బాలసముద్రంలో కేటీఆర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ద్విచక్రవాహనదారుడు గాయపడ్డాడు.