KTR accused CM Revanth Reddy: ఓటమి భయంతోనే..
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:48 AM
పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నడు
ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలనను చూపించి.. అప్పుడు ప్రజల తీర్పు కోరాలి
హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి
సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు
రోశయ్య, కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు
కేసీఆర్ హయాంలో అన్నిరంగాల్లో జోష్
రేవంత్‌లాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు
జూబ్లీహిల్స్‌లో రోడ్ షోలో కేటీఆర్
రేవంత్‌రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం
బ్లాక్‌మెయిల్ తప్ప పాలన చేతకాదు
‘మీట్ ది ప్రెస్’లో హరీశ్‌రావు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని.. అందుకే ఈ ఎన్నిక ఫలితాలు ప్రభుత్వానికి, పరిపాలనకు, తనకు రెఫరెండం కాదని చెప్పారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్‌కుదమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రెఫరెండం కాదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని స్పష్టమైందన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ వెంగళరావు నగర్‌లో శుక్రవారం రోడ్డు షో నిర్వహించారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలే కనిపిస్తున్నాయని.. సబ్బండ వర్గాలనూ ఆరు గ్యారెంటీల పేరుతో ఆయన మోసం చేశారని ధ్వజమెత్తారు. దుర్యోధనుడి స్థాయిలో డైలాగులు కొట్టిన రేవంత్ 162 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. రోజుకొకరు చొప్పున ఇప్పటి వరకు 700 మంది రైతులు ఉరి పోసుకునే దుస్థితి తలెత్తిందన్నారు. ‘విద్యార్థులు, యువకులు, రైతన్నలు, పారిశ్రామికవేత్తలకు చేసిన మోసాలను చూసి రేవంత్ రెడ్డికి, కాంగ్రె్‌సకు ఓటు వేయాలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని.. గతంలో ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచాక ఒక్క రూపాయి అభివృద్ది పని కూడా చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము అడిగితే రేవంత్ తనకు సంబంధంలేని కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటు వేయాలని అడగడమేంటని ఎద్దేవా చేశారు.
అర్హతే లేదు..
ఎన్నికల కోసం రేవంత్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని.. కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హతేలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్థంగా భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టిన ఎన్టీఆర్ పేరును తొలగించిన ఆ పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌కు అహంకారం అంటూ గతంలో రేవంత్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిందే కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా అని, ఆ పార్టీలో ఉండి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. తమ హయాంలో ఖమ్మం జిల్లాలో 70 అడుగుల ఎత్తుతో, మోతీనగర్‌లో ఒకటి, కూకట్‌పల్లిలో మూడు ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. తమ అభ్యర్థి సునీతను గెలిపిస్తే.. ఎన్టీఆర్ కాంస్యవిగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఆ ఇద్దరూ..
‘‘2000 సంవత్సరంలో టీఆర్‌ఎస్ ఆవిర్బవించింది. 14 సంవత్సరాలు రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం. మీ ఆశీర్వాదంతో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నాం. 25 ఏళ్ల కాలంలో ఆరుగురు సీఎంలను చూశాం. చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి గట్టిగా పని చేశారు, వైఎస్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా రాష్ట్రం కోసం పని చేశారన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోయాయని పేర్కొన్నారు.
హైడ్రా దందాతో ఢిల్లీకి మూటలు..
‘‘హైడ్రా అనే దందాతో రియల్ ఎస్టేట్ కంపెనీలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు’’అని కేటీఆర్ ఆరోపించారు. ‘నీకు సిగ్గుంటే.. నీ ప్రభుత్వానికి ఇజ్జత్ ఉంటే ముందు నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, నీ సోదరుడి ఇళ్లు ముందు కూలగొట్టాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అరెకపూడి గాంధీ 11 ఎకరాలు కబ్జా పెడితే.. అక్కడకు వెళ్లిన హైడ్రా ఎలాంటి చర్య లూ తీసుకోలేదన్నారు. ‘‘హైడ్రా అరాచకం, దుర్మార్గం ఆగాలంటే. బుల్డోజర్ మీ ఇంటి మీదకు రావొద్దంటే కాంగ్రె్‌సను ఈ ఎన్నికల్లో పచ్చడి చేయాలి. మీరు కత్తి మాకు ఇచ్చి యుద్ధం చేయమంటే చేస్తామని, వేరే వాళ్లకు కత్తి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎలా?’’ అని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు.
గాడిద నీపై అరిస్తే.. నువ్వూ అరవకు!
‘ఎక్స్’లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. శుక్రవారం సాయంత్రం ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. తన ఎక్స్ ఖాతాలో గాడిద బొమ్మ ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసి.. ‘ఇఫ్ యూ నో యూ నో’ అని నర్మగర్భ వ్యాఖ్య పెట్టారు.. ఆ చిత్రంపై.. ‘‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’’ అనే కొటేషన్ ఉంది. సీఎం రేవంత్ తనపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఆయన ఈ పోస్టు పెట్టారని బీఆర్ వర్గాలంటున్నాయి.