KTR: బాకీ కార్డుతో రేవంత్ భరతం పడతాం
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:42 AM
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రారంభించిన బాకీ కార్డు ఉద్యమంతో రేవంత్‌రెడ్డి సర్కారు భరతం పడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్...
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రారంభించిన బాకీ కార్డు ఉద్యమంతో రేవంత్‌రెడ్డి సర్కారు భరతం పడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి బీఆర్‌ఎ్‌సలో చేరారు. గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. తామిచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారి అబద్ధపు హామీలను అందరికీ గుర్తు చేసేందుకే బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్‌ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఉన్న నగరాన్ని ఉద్థరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరవయ్యారని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, వీధిదీపాలు వెలగడంలేదని మండిపడ్డారు. కాగా, సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ఎక్స్‌వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.