Share News

BRS working president KTR: జూబ్లీహిల్స్‌ తీర్పుతో రేవంత్‌ పీఠం కదలాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:10 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాల తీర్పుతో సీఎం రేవంత్‌రెడ్డి పీఠం కదలాలి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు సీఎం కుర్చీ కోసం ఢిల్లీలో......

BRS working president KTR: జూబ్లీహిల్స్‌ తీర్పుతో రేవంత్‌ పీఠం కదలాలి

  • గోస పడుతున్న తెలంగాణ మీ దిక్కు చూస్తోంది

  • యూసు్‌ఫగూడ రోడ్‌ షోలో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాల తీర్పుతో సీఎం రేవంత్‌రెడ్డి పీఠం కదలాలి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు సీఎం కుర్చీ కోసం ఢిల్లీలో రేవంత్‌పై కత్తులు నూరుతున్నరు. మీరిచ్చే షాక్‌తో మూడేళ్లు కాదు.. మూడు నెలలు కూడా ఆయన పదవిలో ఉండే పరిస్థితి ఉండదు’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ఓటుకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు పంచాలని కాంగ్రెస్‌ నేతలను సీఎం రేవంత్‌రెడ్డి పంపారని, వాటిలోనూ ఆ పార్టీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చే డబ్బులు తీసుకొని.. కారు గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను కోరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆదివారం యూసు ఫ్‌గూడలో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ హామీలైన ఆరు గ్యారంటీలు, తులం బంగారం, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. రెండేళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయిన సీఎం.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్ముతారని నిలదీశారు. శని, ఆదివారం వచ్చిందంటే పేదల ఇళ్లపైకి బుల్డోజర్‌ వస్తుందని, ఇందిరమ్మ రాజ్యమంటూ వేల ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో సునీతమ్మను గెలిపిస్తే హైడ్రా బుల్డోజర్‌కు అడ్డుగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలై, పేదలు కష్టపడి కొనుక్కున్న ప్లాట్ల ధరలు అమాంతం పడిపోయి, వారి పెట్టుబడి హారతి కర్పూరంలా కరిగిపోయే దుస్థితి నెలకొందన్నారు. ‘జూబ్లీహిల్స్‌ ఓటర్లు కాంగ్రె్‌సను ఓడిస్తే.. అన్ని హామీలు అమలవుతాయి. గోస పడుతున్న రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు మీ దిక్కు చూస్తున్నారు’ అని అన్నారు.

ఇప్పుడే బెదిరిస్తున్నారు.. గెలిస్తే బతకనిస్తరా?

ఓటు వేయకుంటే సంగతి చూస్తామని కొందరు ఆకు రౌడీలు బెదిరిస్తున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే వాళ్లు గెలిస్తే బతకనిస్తరా..? అని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై వ్యాపారులు, సామాన్య ప్రజానీకం ఆలోచించాలని కోరారు. నేర చరిత్ర ఉన్న వాళ్లకు ఓటు వేయాలా.. వద్దా..? అన్నది మీరే తేల్చుకోవాలన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ కాంగ్రె్‌సకు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - Nov 10 , 2025 | 03:10 AM