BRS working president KTR: భూ కుంభకోణంపై స్పందించండి రాహుల్.. !
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:49 AM
హైదరాబాద్‌లో రూ.5లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని, దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తక్షణం స్పందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ....
లేదంటే మీకూ.. భాగస్వామ్యం ఉన్నట్లే: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రూ.5లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని, దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తక్షణం స్పందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టీపీ).. వెనక పెద్ద కుంభకోణం ఉందని వివరిస్తూ.. రాహుల్‌కు ఆదివారం ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. దీనిపై మౌనంగా ఉంటే రాహుల్‌కూ ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్‌లలో ఉపాధి కల్పన ను ప్రోత్సహించడానికి.. రాయితీ ధరలకే గత ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని తెలిపారు. హెచ్‌ఐఎల్‌టీపీ కింద.. ఇప్పుడు లక్షల కోట్ల విలువైన భూములను సబ్-రిజిస్ర్టార్ కార్యాలయం సూచించే విలువలో, కేవలం 30శాతం చెల్లించి వాణిజ్య లేదా నివాస జోన్‌లుగా మార్చుకోవచ్చని చెబుతున్నారని అన్నారు. ప్రజలకు దక్కాల్సిన ఈ విలువైన ఆస్తులను నామమాత్రపు ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా ఈ విధానం ఉందని ఆరోపించారు. ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. తన బహిరంగలేఖకు రాహుల్ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా ఉంటుందా?..లేక ప్రజల ఆస్తులను దోచుకుంటున్న నేతలకు అండగా నిలబడేలా ఉంటుందా? అన్నది ప్రజలు గమనిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.