KTR Labels: స్కాంగ్రెస్ ఏటీఎంగా తెలంగాణ
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:54 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్న కాకి లెక్కల డొల్లతనం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్..
అప్పులపై కాంగ్రెస్ కాకిలెక్కలు :కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్న కాకి లెక్కల డొల్లతనం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) అక్టోబరు నెల నివేదికతో బట్టబయలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గతంలో తమ బీఆర్‌ఎస్ సర్కారు అప్పులతో ఆస్తులు సృష్టిస్తే.. కాంగ్రెస్ సర్కారు అప్పుల సునామీతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటు వెల్లడించిన లెక్కల ప్రకారం పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు రూ.2.80 లక్షల కోట్లు అప్పులతో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఉత్పాదక ఆస్తులు సృష్టించిందన్నారు. కానీ, ఒక్క ప్రాజెక్టు నిర్మించకుండా, మౌలిక వసతులకు ఒక ఇటుక పేర్చకుండానే 23 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు తెచ్చిన రూ.2.30 లక్షల కోట్ల అప్పులేం చేశారని ప్రశ్నించారు. అప్పులపై వడ్డీ చెల్లింపులపై తప్పుడు లెక్కలు చెప్పినందుకు సీఎం రేవంత్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి మూటలు మోయడానికే వీటిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ‘స్కాంగ్రెస్ ఏటీఎం’గా మార్చారని మండిపడ్డారు. ‘ప్రతి నెలా రూ.6000-7000 కోట్లను అప్పులపై వడ్డీల చెల్లింపునకు చెల్తిస్తున్నామని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. కాగ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబరు మధ్య అప్పులపై 16,529.88 కోట్లు వడ్డీ చెల్లించిందన్న కేటీఆర్.. నెలకు సగటున రూ.2,361.41 కోట్లు మాత్రమే వడ్డీ చెల్లింపులకు వినియోగిస్తున్నారని అర్థమవుతోందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా 7 నెలల్లో తెచ్చిన అప్పుల వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఒకే వేదికపై జగన్, కేటీఆర్!
బెంగళూరు/అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బెంగళూరులో భేటీ అయ్యారు. ఒక క్రీడా కార్యక్రమంలో ఇద్దరూ వేదిక పంచుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన ‘సర్జ్ ఈక్వెస్ట్రియల్ లీగ్’ (అశ్వక్రీడ) ఫైనల్ పోటీలకు వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు గంటపాటు సాగిన ఫైనల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. విజేతగా నిలిచిన మ్యాగిలెటో బృందానికి జగన్, కేటీఆర్ కలిసి ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా వారు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించుకున్నట్లు తెలుస్తోంది.