KTR Holds CM Revanth Reddy: రైతు ఆత్మహత్యలకు రేవంత్‌దే బాధ్యత
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:21 AM
రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఈ బలవన్మరణాలకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాఽధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్...
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఈ బలవన్మరణాలకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాఽధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సర్కార్ తెచ్చిన వ్యవసాయ సంక్షోభం, హామీల వైఫల్యం కారణంగానే అన్నదాతలు తమ నిండుప్రాణాలను బలి తీసుకుంటున్నారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఒకేరోజు రాజన్నసిరిసిల్ల జిల్లా అచ్చన్నపేట రైతు మొగిలి లక్ష్మణ్, మహబూబాబాద్ జిల్లా నారాయణపురం పీక్లాతండాకు చెందిన గుగులోత్ భాస్కర్, హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన అనిల్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను వేదనకు గురిచేయొద్దని సూచించారు. రైతువ్యతిరేక రేవంత్ సర్కార్‌పై సంఘటితంగా పోరాడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే గురుకులాలకు అద్దెబకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని, విద్యాశాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డివల్లే ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అద్దెబకాయిలను విడుదలచేసి, విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.