KTR Files Defamation Suit : బండి సంజయ్‌పై పరువు నష్టం దావా
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:12 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. రాజకీయ కక్షతో తనపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు....
సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటుపలు మీడియా సంస్థలపై కూడా దాఖలు
రూ.10కోట్ల పరిహారం చెల్లించాలంటూ సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పిటిషన్
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. రాజకీయ కక్షతో తనపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు రూ.10కోట్ల మేర పరిహారం చెల్లించాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. బండి సంజయ్‌తోపాటు ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేసిన పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా దావా వేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 8న తెలంగాణ ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకల్లో కేటీఆర్ పాత్ర ఉందంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఏబీఎన్, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్‌ఎన్ తెలుగు వంటి టీవీ చానళ్లు, ఇండియాటుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఎక్స్, యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్/ ఇన్‌స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రసారమయ్యాయని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపినా.. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు కేటీఆర్ కార్యాలయం తెలిపింది.