KTR: గ్రూప్-1 అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:30 AM
గ్రూప్-1 పరీక్షల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్‌సపీఎస్సీ) అవకతవకలకు పాల్పడ్డాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ...
పరీక్షలు మళ్లీ నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి: కేటీఆర్
హైదరాబాద్/మహబూబ్‌నగర్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్‌సపీఎస్సీ) అవకతవకలకు పాల్పడ్డాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. టీఎ్‌సపీఎస్సీ అవినీతి, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకున్న వారెవరో బయటికి రావాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులను గుర్తించిన హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని, ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా అవకతవకలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరవాలన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగుల ఓట్లు దండుకొని రాష్ట్రంలో గద్దెనెక్కిందని, వారికి మాయమాటలు చెప్పిన రాహుల్‌గాంధీ ఈ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. భారీగా ఉద్యోగాలు ఇచ్చామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారు..
నిన్నగాక మొన్న పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరారని చెప్పి ఫిరాయింపులపై టీపీసీసీ అధ్యక్షుడు అప్రూవర్‌గా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ నేరాంగీకారం చేసిన తర్వాత ఆ పదిమందిపై వేటు వేయడానికి స్పీకర్‌కు మొహమాటం ఎందుకని ప్రశ్నించారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా కూడా సిగ్గులేకుండా బీఆర్‌ఎ్‌సలో ఉన్నామని చెబుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సలోనే ఉంటే పార్టీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదని,పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్‌కు సూచించిందని, స్పీకర్ ఏదైనా ఉల్టా పల్టా చేస్తే పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన విషయాన్ని కోర్టు ముందు పెడతామని చెప్పారు. కాగా, డబ్బులు తీసుకుని సీఎం రేవంత్ గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని బీఆర్‌ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆరోపించారు.