Share News

KTR letter to Petroleum Minister: పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:27 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్షణమే తగ్గించాలని, కేంద్రం సుంకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలపై భారం మోస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎద్దేవా చేశారు.

KTR letter to Petroleum Minister: పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలి

సుంకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

కేంద్ర మంత్రి హర్దీ్‌పసింగ్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని, కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించి అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పారదర్శక ధరల విధానం అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పూరీకి ఆయన లేఖ రాశారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 100డాలర్లు దాటినప్పుడు కూడా ఇప్పటితో పోలిస్తే దేశంలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా... ప్రజలపై భారం మోపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ధరలు స్థిరంగా ఉంచి, ఓట్ల పండగ ముగియగానే పెంచడం ప్రజల్ని వంచించడమేనని పేర్కొన్నారు. మోదీ సర్కారు ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని, పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వకుండా సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థికవ్యవస్థ పురోగతికి సహకరిస్తున్న తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే.. సుంకాల వసూళ్లతో కేంద్రం పెత్తనం చెలాయించడం అభ్యంతరకరమన్నారు. సుంకాలు, ఆదాయ వాటా వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు.

Updated Date - Apr 10 , 2025 | 05:27 AM