Share News

BRS Working President K.T. Rama Rao: దాడులు చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై..హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:26 AM

కాంగ్రెస్‌ అరాచకాలను ఉపేక్షించబోం. ఆ పార్టీ కార్యకర్తలు దాడులు, హత్యాయత్నం ఘటనలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం....

BRS Working President K.T. Rama Rao: దాడులు చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై..హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

  • పోలీసుల తీరు సరికాదు.. తిరగబడే రోజు వస్తది: కేటీఆర్‌

రెజిమెంటల్‌బజార్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ అరాచకాలను ఉపేక్షించబోం. ఆ పార్టీ కార్యకర్తలు దాడులు, హత్యాయత్నం ఘటనలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం, పోలీసులు కాలయాపన చేస్తున్నారు. దాడులకు పాల్పడ్డ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా సోమార్‌పేట్‌లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటిని ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతి, బాలమణి, మరో చిన్నారిని మంగళవారం కేటీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తదని పేర్కొన్నారు దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే తాము కూడా తెగబడవలసి వస్తుందని, జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, నిందితులను శిక్షించే వరకు పోరాడతుందని చెప్పారు. చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు బీఆర్‌ఎస్‌ భరిస్తుందని, ప్రభుత్వం కూడా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండలో మల్లయ్య యాదవ్‌ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్‌ చేసి మూత్రం తాగించిన ఘటనలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు.

Updated Date - Dec 17 , 2025 | 04:26 AM