Share News

KTR Criticizes Congress: రాహుల్‌కు దేశ భవిష్యత్తుపై విజన్‌ లేదు

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:25 AM

జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించలేకపోయిందన్నారు. రాహుల్‌ గాంధీ...

KTR Criticizes Congress: రాహుల్‌కు దేశ భవిష్యత్తుపై విజన్‌ లేదు

  • మోదీకి అతిపెద్ద బలం.. ప్రతిపక్షాల మెడలో కట్టిన భారీ మొద్దు ఆయన నాయకత్వమే

  • ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రత్యామ్నాయం

  • శివ నాడార్‌ ఫౌండేషన్‌ ‘ఇగ్నీషన్‌’ సదస్సులో కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించలేకపోయిందన్నారు. రాహుల్‌ గాంధీ, ఆయన నాయకత్వం దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా మారిందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతిపక్షం మెడలో కట్టిన పెద్ద మొద్దు లెక్కన రాహుల్‌ నాయకత్వం తయారైందన్నారు. ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్‌ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమవుతుందన్నారు. చెన్నైలో ఐటీసీ గ్రాండ్‌ చోళా వేదికగా మంగళవారం శివ నాడార్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘ఇగ్నీషన్‌’ సదస్సులో కేటీఆర్‌ పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్‌ శోమా చౌదరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ‘రిబూటింగ్‌ ది రిపబ్లిక్‌’ అనే అంశంపై కేటీఆర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నారు. బిహార్‌ వంటి రాష్ట్రాల్లో తోక పార్టీ లాంటి కాంగ్రెస్‌... అనేక స్థానాల్లో పోటీ చేస్తామని మొండికేయడం వల్లే బీజేపీకి లబ్ధి చేకూరుతోందన్నారు. దక్షిణాదిన బీజేపీకి భవిష్యత్తు ఉందని అనుకోవడంలేదన్న కేటీఆర్‌... రానున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించి బలమైన పాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు అనేక రంగాల్లో ముఖ్యంగా ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణ గత రెండేళ్లలో వెనుబడిందని కేటీఆర్‌ అన్నారు. మంచిగా నడుస్తున్న వ్యవస్థలను ఇబ్బందులకు గురిచేయడమే దీనికి కారణమన్నారు. ప్రభుత్వాల నుంచి ప్రజలను కాపాడుకోవడమే దేశభక్తుల ప్రథమ కర్తవ్యమని ఒకప్పుడు థామస్‌ పెయిన్‌ చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణలోని పరిపాలనను చూస్తే గుర్తుకొస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


వారసత్వ రాజకీయాలపై బీజేపీది అవకాశవాదమే

వ్యాపారాల్లో, కంపెనీల్లో వచ్చినట్లు రాజకీయాల్లో వారసత్వంతో అన్నీ రావని, ప్రజల ఆమోదం, ఆశీర్వాదం ఉన్నంతవరకే రాజకీయాల్లో కొనసాగుతారని కేటీఆర్‌ అన్నారు. వారసత్వ రాజకీయాల గురించి పదే పదే మాట్లాడే బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కుటుంబ పార్టీలైన శివసేన మొదలు తెలుగుదేశం, జేడీయూ వరకు అన్ని రకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోందన్నారు. అందరి అంచనాలు ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ేస్నహితుల అంచనాలకు అనుగుణంగా జీవితంలో ఉండడం సవాలుతో కూడుకున్న అంశమన్నారు.

‘హిల్ట్‌’ భూ కుంభకోణంపై పోరుబాట

హైదరాబాద్‌లోని విలువైన పారిశ్రామిక భూములను బహుళ ఉపయోగ జోన్‌గా మార్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) పేరుతో కాంగ్రెస్‌ సర్కారు 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై పోరుబాట చేపడతామని తెలిపారు. అందులో భాగంగా పార్టీ నియమించిన నిజ నిర్ధారణ బృందాలు బుధ, గురువారాల్లో ఆయా పారిశ్రామికవాడల్లో పర్యటిస్తాయని చెప్పారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాల్లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.

Updated Date - Dec 03 , 2025 | 04:25 AM