Share News

BRS Working President KTR: పాలిచ్చే బర్రెను వదిలిదున్నపోతును తెచ్చుకున్నట్లుంది

ABN , Publish Date - Dec 19 , 2025 | 05:04 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాజకీయం అత్యంత గలీజుగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి...

BRS Working President KTR: పాలిచ్చే బర్రెను వదిలిదున్నపోతును తెచ్చుకున్నట్లుంది

  • 3 ఫీట్ల రేవంత్‌రెడ్డి.. 30 ఫీట్ల డైలాగ్‌లు కొడుతున్నారు .. మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు

  • ప్రజాబలంతో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు తిరుగులేని విజయం

  • లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో పార్టీకి పూర్వ వైభవం

  • పార్టీ ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయం

  • స్పీకర్‌ సీఎం చెప్పినట్టు ఆడుతూ ఫిరాయింపులు కనబడనట్లు నటిస్తున్నారు

  • భువనగిరిలో సర్పంచ్‌ల సన్మాన సభలో కేటీఆర్‌

యాదాద్రి/హైదరాబాద్‌ డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాజకీయం అత్యంత గలీజుగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి... దున్నపోతును తెచ్చుకున్నట్లుందని వ్యాఖ్యానించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుసభ్యుల అభినందన సభలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఎక్కడ అధికారం పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెప్పారని, సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో నిరాశ ఎదురైనప్పటికీ ఇప్పుడు సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజాబలంతో బీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించిందన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతోందని, తమ పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులను కేటీఆర్‌ ఖండించారు. అధికారులు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ గెలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను దొంగతనంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ అన్యాయాలపై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని, జిల్లాల్లో లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మూడు ఫీట్లున్నా... 30 ఫీట్ల డైలాగులు కొడతారని...అయితే క్షేత్రస్థాయిలో ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులకు పాల్పడుతూ సిగ్గులేని రాజకీయం చేస్తున్నారంటూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కడియం శ్రీహరి లాంటివారు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీనస్థితిలో ఉన్నారన్నారు. సీఎం చెప్పినట్టు స్పీకర్‌ ఆడుతూ ఫిరాయింపులు కనబడనట్లుగా నటిస్తున్నారని ఆరోపించారు.


పథకాల పేర్ల మార్పులో బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే..

పథకాల పేర్లు మార్చడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దొందూ దొందేనని కేటీఆర్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడమే లక్ష్యంగా ఈ రెండు ఢిల్లీ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించి బీజేపీ తన సంకుచితత్వాన్ని చాటుకుందని, పేరు మార్పు క్షమించరాని నేరమని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా కాంగ్రెస్‌ సర్కార్‌ మార్చిందని చెప్పారు. బతుకమ్మ చీరలను నిలిపివేసి రాజకీయ రంగుతో ఇందిరమ్మ చీరలుగా మార్పుచేశారని, రైతు బంధును రైతుభరోసాగా మార్చారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్‌ తల్లిని ప్రజలపై రుద్దడం అమానుషమని పేర్కొన్నారు. రేవంత్‌ సర్కార్‌ రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా మారిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వేలకోట్ల విలువైన భూమిని అక్రమమార్గంలో సీఎం నజరానాగా ఇచ్చారని ఆరోపించారు. ఐడీపీఎల్‌ భూమిపై విచారణ అంటూ దొంగ డ్రామాలు ఆడుతున్నారని మండి పడ్డారు. గాజుల రామారంలోని 307సర్వే నంబర్‌లోనూ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 19 , 2025 | 05:04 AM