Share News

BRS Working President K. T. Rama Rao: రేవంత్‌.. దమ్ముంటే ఆ 10మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:44 AM

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్‌ఎస్‌ నుంచి అక్రమంగా ఎత్తుకుపోయిన...

BRS Working President K. T. Rama Rao: రేవంత్‌.. దమ్ముంటే ఆ 10మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

  • గబ్బిలాల్లా వేలాడుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..

  • స్పీకర్‌ ముంగిట పచ్చి అబద్ధాలు : కేటీఆర్‌

సిరిసిల్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్‌ఎస్‌ నుంచి అక్రమంగా ఎత్తుకుపోయిన పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. ఆ పది స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఏవైపు ఉన్నారో తెలుస్తుందని చెప్పారు. పదవుల కోసం చూరు పట్టుకొని గబ్బిళాల్లా వేలాడుతున్న ఆ ఎమ్మెల్యేల బతుకులు పూర్తిగా ఆగమైపోయాయని అన్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి, స్పీకర్‌గా పనిచేసిన పోచారం శ్రీనివా్‌సరెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచలాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రె్‌సలో చేరామని బయట మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్‌ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్‌ విచారణలో మాత్రం తాము బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో స్పీకర్‌ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రె్‌సకు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలని, వచ్చే సంవత్సరంలో కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. రాబోయే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని ఆయన అన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 04:44 AM