Share News

KTR Challenge: ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:31 AM

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయిస్తే.. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌..

KTR Challenge: ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

  • ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చూపిస్తాం

  • సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

  • గ్రూప్‌-1 ఉద్యోగాలను అమ్ముకున్నారు

  • ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లు పోగేశారు

  • ‘గద్వాల గర్జన’ సభలో కేటీఆర్‌ ధ్వజం

గద్వాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయిస్తే.. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియ్‌సగా ఉందన్నారు. ఉప ఎన్నికలు రావడం గ్యారెంటీ అని, వారిని తుక్కుతుక్కుగా ఓడిద్దామని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ‘గద్వాల గర్జన’ పేరుతో నిర్వహించిన సభకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి కోసం వెళ్లామంటున్న ఎమ్మెల్యేలు.. ఎవరి అభివృద్ధి కోసమో చెప్పాలని, వారి నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో చూపించాలని అన్నారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌గా చేసి బంగారు పల్లెంలో అప్పగిస్తే.. తెలంగాణ అప్పుల పాలైందని, క్యాన్సర్‌ రోగం వచ్చిందని రేవంత్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రం దివాలా తీసింది అంటే పైసలు ఇచ్చేవాడు ఎవడైనా ఇస్తాడా? ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చా? అర్ధరాత్రి లంకె బిందెల కోసం తిరిగే వారిని ఏమంటారు? ప్రజలు ఏమైనా అంటే తిరిగి వారిపై కేసులు పెడతారు. ఢిల్లీకి పోతే ఆయనకు అపాయింట్‌మెంట్లు ఇస్తలేరట. చెప్పులు ఎత్తుకెళతాడనే భయంతోనేమో! ఇలాంటివాడు మన సీఎం.. ఇది మన ఖర్మ’’ అని అన్నారు.

గ్రూప్‌-1 పోస్టులు అమ్ముకున్నారు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. రెండున్నరేళ్లు అయినా కల్పించడంలేదని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లు గ్రూప్‌-1 పోస్టులను అమ్ముకున్నారని, ఒక్కో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును రూ.3 కోట్లకు అమ్ముకొని రూ.1500 కోట్లకు పైగా పోగేసుకున్నార ని ఆరోపించారు. ఈ విషయమై అభ్యర్థులు రుజువులతో కోర్టులో కేసు వేస్తే పరీక్ష ఫలితాలను కోర్టు రద్దు చేసిందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను అమ్ముకున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి పది లక్షల ఎకరాల సాగును పెంచామని చెప్పారు. కేసీఆర్‌ వల్లే పాలమూరు అన్నం పెట్టే అన్నపూర్ణ అయిందన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 05:31 AM