KTR Challenges: నన్ను అరెస్టు చేస్తారా? చేసుకోండి!
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:29 AM
నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం కోసం తనను అరెస్టు చేస్తామంటే..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా
280 ఎకరాల మెట్రో భూములపై రేవంత్ కన్ను
అందుకే కక్ష గట్టి ఎల్‌అండ్‌టీని పంపించేస్తున్నారు:కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ‘‘నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం కోసం తనను అరెస్టు చేస్తామంటే.. చేసుకోండి! నేను నిజాయితీకి కట్టుబడి ఉన్నా. అరెస్టులకు భయపడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అరెస్టు చేసినా.. ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటా. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ వెటాండుతుంటా’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ కోసం ఎల్‌అండ్‌టీకి కేటాయించిన 280ఎకరాల భూములపై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితుల కన్ను పడిందని, అందుకే కక్ష గట్టి ఆ సంస్థను వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలపై మరో రూ.15వేల కోట్ల అప్పును రుద్దాలని చూస్తున్నారన్నారు. మేడిగడ్డ విషయంలో బీఆర్‌ఎ్‌సను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఎల్‌అండ్‌టీ ముందుకు రావడం వల్లే.. సీఎం ఆ సంస్థపై కక్ష గట్టారని విమర్శించారు. ఎల్‌అండ్‌టీకి అర్హత లేదని చెప్పి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్‌ను తన అనుచరుడైన బాంబులేటి శ్రీనివా్‌సరెడ్డి సంస్థకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. మెట్రోను హస్తగతం చేసుకోవాలన్న నిర్ణయంలో పారదర్శకత లేదని, కనీసం క్యాబినెట్‌లోనూ చర్చించలేదని మండిపడ్డారు. ఓకార్పొరేట్ సంస్థను రేవంత్‌రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతానని వెల్లడించారు.