BRS Executive President KTR criticized Congress: కాంగ్రెస్‌తో ఫేక్ బంధం.. బీజేపీతో పేగు బంధం
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:03 AM
సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రె్‌సతో ఉన్నది ఫేక్ (నకిలీ) బంధమని, ఆయనది బీజేపీతో పేగు బంధమని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు..
సెంటిమెంట్‌పై రేవంత్ మాటలు విడ్డూరం
పథకాలు రద్దంటే.. ప్రజలే బుద్ధి చెబుతారు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం
ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతుచేస్తే
500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం: కేటీఆర్
హైదరాబాద్ సిటీ/ హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రె్‌సతో ఉన్నది ఫేక్ (నకిలీ) బంధమని, ఆయనది బీజేపీతో పేగు బంధమని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామను బండ బూతులు తిట్టిన వ్యక్తి, సెటిల్‌మెంట్లు, బ్లాక్ మెయిలింగ్‌లు చేసిన వ్యక్తి సెంటిమెంట్ గురించి మాట్లాడుతుండటం విడ్డురంగా ఉందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి గల్లంతవడం ఖాయమని, ఓటమి భయంతోనే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని రేవంత్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రె్‌సకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రె్‌సకు డిపాజిట్ రాకపోతే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా శనివారం రాత్రి రహమత్‌నగర్‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ‘‘ఒక్క సీటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. 14 మంది మంత్రులు గల్లీ గల్లీలో తిరుగుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని రేవంత్ ధమ్కీ ఇస్తున్నారు. అసలు రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిందేమిటి? ఏం చేశారని రద్దు చేస్తారు. పింఛన్ల పెంపు, యువతులకు స్కూటీలు, తులం బంగారం, ఇందిరమ్మ ఇళ్లు అని మాట ఇచ్చి తప్పారు. ఇచ్చింది ఒక్కటే మహిళలకు ఫ్రీ బస్సు. అది కూడా మగవాళ్లకు చార్జీలు డబుల్ వసూలు చేస్తున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు. మాగంటి గోపీనాథ్ ఎస్పీఆర్ హిల్స్‌లో కోట్ల విలువైన భూమిని కాపాడారని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిపిస్తే ఆ స్థలంలో స్టేడియం కట్టి గోపీనాథ్ పేరు పెడమని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో 4 లక్షల మంది బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే, రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రె్‌సను దెబ్బకొడితేనే వాళ్లు ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే పక్కనే ఉన్న తెలంగాణ భవన్‌లోంచి తాము వెంటనే వచ్చి అండగా నిలబడతామని చెప్పారు.
బీఆర్‌ఎ్‌సలో చేరిన పలువురు నేతలు
తెలంగాణ టీడీపీకి చెందిన పలువురు నేతలు శనివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. వారికి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకోవాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా భాష మార్చుకోవాలని, ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో రూ.44 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.