BRS Working President K.T. Rama Rao: గల్లా పట్టి పథకాలు అమలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:15 AM
జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేయకపోతే పథకాలు ఇవ్వడట. ఇవ్వకపోవడానికి నీ అయ్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా..
సంక్షేమం ఆపడానికి నీ అయ్య సొమ్మా?.. రేవంత్‌వి ఉద్దర మాటలు.. నమ్మొద్దు
16 నెలల్లో కంటోన్మెంట్‌కు 16 పైసలిచ్చారా?
తెలంగాణను అట్టర్‌ఫ్లాప్ రాష్ట్రంగా మార్చారు
జూబ్లీ హిల్స్‌లో ఓడిస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేయకపోతే పథకాలు ఇవ్వడట. ఇవ్వకపోవడానికి నీ అయ్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా.. రేవంత్?’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే కాంగ్రెస్ నేతల గల్లా పట్టి పథకాలు అమలు చేయిస్తామన్నారు. ‘హిట్లర్ లాంటి నియంతలే పోయారు.. నువ్వెంత’ అని సీఎంను ఉద్దేశించి మండిపడ్డారు. సోమవారం ఆయన బోరబండ డివిజన్‌లో రోడ్ షో నిర్వహించారు. రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి నెలకు రూ.100 కోట్లు పంపుతున్నారని ఆరోపించారు. ఢిల్లీకి పంపేందుకు పైసలున్నాయి కానీ తెలంగాణ గల్లీల్లో ఉండే గరీబోళ్లకు ఇచ్చేందుకు లేవా? అని ప్రశ్నించారు. ‘ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా అని రేవంత్ అంటున్నడు. రెండేళ్ల కింద అవకాశం ఇచ్చినందుకే కదా.. హైదరాబాద్‌ను ఆగం చేసినవు.. అయ్యా నీకు ఒక ఛాన్స్ ఇస్తేనే 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నరు. 700 మంది రైతులు చచ్చిపోయే పరిస్థితి తలెత్తింది. ఇందిరమ్మ రాజ్యమని వేల ఇళ్లు కూలగొట్టినవు. సున్నం చెరువులో ఉండే గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి.. మెడలు పట్టి బయటకు గెంటేశావు. రియల్ ఎస్టేట్‌ను కుప్పకూల్చావు. అగ్రభాగాన ఉన్న తెలంగాణను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లి అట్టర్‌ప్లాఫ్ రాష్ట్రంగా మార్చావ’ని విమర్శించారు. అభివృద్ధి అంటోన్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. ‘సీఎం కలుస్తలేడు. పైసా ఇస్తలేడ’ని ఓ ఎమ్మెల్యే రూ.100 కోట్ల రుణం కావాలని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారన్నారు. కంటోన్మెంట్‌లో గెలిచి 16 నెలలైనా 16 రూపాయలైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లేదని, లూటిఫికేషన్ జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం మీ కళ్ల ముందు కనిపిస్తోందని, రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలూ అమలు చేయలేదన్నారు. జూబ్లీ హిల్స్‌లో ఓడిస్తేనే ప్రభుత్వం దిగొచ్చి.. హామీలు అమలు చేస్తుందన్నారు. కులాలు, మతాలకతీతంగా అందరూ తిరిగి కేసీఆర్ సీఎం కావాలనుకుంటున్నరన్నారు. ‘ఆడపిల్ల ఏం చేస్తదనుకోవద్దు. సునీతమ్మకు అండగా నేనున్నా. విష్ణు వర్దన్ రెడ్డి, కేసీఆర్ ఉన్నారు. పక్కనే తెలంగాణ భవన్ ఉంది. అర్ధరాత్రి ఫోన్ చేసినా.. అర్ధ గంటలో మీ ముందుంటాం. కాంగ్రెస్ గూండాల గల్లా పట్టి నిలదీస్తామ’ని కేటీఆర్ అన్నారు.