Share News

KTR Attacks Congress: ఇంటింటికీ కాంగ్రెస్‌ బకాయిల కార్డు!

ABN , Publish Date - Sep 29 , 2025 | 04:35 AM

రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని.. జాయింట్‌ వెంచర్‌ సర్కారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు..

KTR Attacks Congress: ఇంటింటికీ కాంగ్రెస్‌ బకాయిల కార్డు!

  • ఆ పార్టీ మోసాలే స్థానిక ఎన్నికల్లో మా ప్రచారాస్త్రం: కేటీఆర్‌

నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని.. జాయింట్‌ వెంచర్‌ సర్కారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పర అవగాహనతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఇంటింటికీ కాంగ్రెస్‌ బకాయి కార్డులను అందించనున్నట్లు తెలిపారు. పులి బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచకుండా అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ తరఫున అచ్చంపేట నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీజేపీలో చేరిన నేపథ్యంలో అచ్చంపేటలో జనగర్జన సభ నిర్వహించారు. ఇందులో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని.. ఆరు గ్యారెంటీలను మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 8 లక్షల పెళ్లిళ్లు జరిగాయని, ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన 8 లక్షల తులాల బంగారం ఎక్కడికి పోయిందని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రజలకు చేసిన మోసాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లి, వారికి ఉన్న బకాయి కార్డులను అందజేయాలని సూచించారు. రేవంత్‌ శరీరంలో అపరిచితుడు ఉన్నాడని.. ఉదయం ‘రాము’లా ఉండే ఆయన సాయంత్రం ‘రెమో’గా మారుతున్నాడని దుయ్యబట్టారు. కాగా, రేవంత్‌ అసమర్థత వల్లే తెలంగాణ అభివృద్ధి గాడి తప్పిందని కేటీఆర్‌ ఎక్స్‌లో మండిపడ్డారు. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోను ప్రభుత్వం తీసుకోవడం వల్ల రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. సీఎం తన రియల్‌ ఎస్టేట్‌ అవసరాల కోసం.. ఉనికిలో లేని ఫోర్త్‌సిటీ వైపు మళ్లించే నెపంతో ఏకపక్షంగా ఎయిర్‌పోర్ట్‌ మెట్రో మార్గాన్ని రద్దు చేశారని విమర్శించారు.

Updated Date - Sep 29 , 2025 | 04:35 AM