KTR and Sunitha Maganti File Nomination: జూబ్లీహిల్స్‌లో మూడో రోజు 10 నామినేషన్లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:12 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు...
బంజారాహిల్స్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం 13 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత.. పార్టీ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌లతో కలిసి రెండు సెట్‌ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు ఆమె.. కుమార్తెలు దిశిర, అక్షర కుమారుడు వాత్సల్యనాథ్‌తో కలిసి జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, స్వతంత్ర అభ్యర్థులుగా చిట్టిబోయిన సులోచనా రాణి, చలికా పార్వతి, చిట్టిబోయిన నటరాజా, మొహమ్మద్ అక్బరుద్దీన్, జమాల్పూర్ మహేశ్‌కుమార్, రహమాన్ షరీఫ్, కాంతే సాయన్న, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ తరఫున బుడ్డయ్య అంబోజు, ప్రజావెలుగు పార్టీ తరఫున ప్రవీణ్‌కుమార్ అరోళ్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 30 నామినేషన్‌లు దాఖలయ్యాయి.
4 కిలోల బంగారం, రూ.32 లక్షల నగదు
మాగంటి సునీత తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చేతిలో రూ.38,800 ఉండగా... మూడు బ్యాంకుల్లోని ఖాతాల్లో కలిపి సుమారు రూ.32 లక్షలు, నాలుగు కిలోల బంగారం సహా బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, వెండి ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ.6,18,54,274గా పేర్కొన్నారు. స్థిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 34లో ఒక ప్లాటు, గోపన్నపల్లిలో మరో ప్లాటు ఉన్నాయని, వాటి విలువ రూ.6.11 కోట్లని తెలిపారు. ముగ్గురు పిల్లల పేరిట రూ.4.62 కోట్ల విలువైన షేర్లు, ఆభరణాలు, రూ.8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట 4.44 కోట్లు, పిల్లల పేరుపై రూ.6 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు.