KTR Accused the Telangana government: రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:04 AM
పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు కేటాయించిన వేలాది ఎకరాల భూముల్ని అతి తక్కువ ధరకు తీసుకొని.. తమ రియల్ ఎస్టేట్ కోసం వినియోగించే యత్నం జరుగుతోందన్నారు....
పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్‌రెడ్డి గ్యాంగ్ స్కాం
9,292 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం
సీఎం సోదరులు, సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు
వచ్చేది మా ప్రభుత్వమే.. భూముల్ని తిరిగి వెనక్కి తీసుకొంటాం: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు కేటాయించిన వేలాది ఎకరాల భూముల్ని అతి తక్కువ ధరకు తీసుకొని.. తమ రియల్ ఎస్టేట్ కోసం వినియోగించే యత్నం జరుగుతోందన్నారు. తద్వారా రేవంత్‌రెడ్డి అండ్ గ్యాంగ్ రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడబోతోందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టీపీ) ప్రజా ప్రయోజన పాలసీ కాదని, దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు.
పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి తన అనుయాయులకు తక్కువ ధరకు కట్టబెట్టి.. భూ కుంభకోణానికి తెరలేపారన్నారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్ సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కారు ఈ భూములను ప్రభుత్వ విలువలో కేవలం 30 శాతానికే అప్పగించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
ఎవరికి లాభం చేకూర్చడానికి?
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్‌ఆర్‌వో రేట్ల కంటే 100 శాతం నుంచి 200 శాతం అధికంగా వసూలు చేసేలా చట్టం చేసిందని కేటీఆర్ తెలిపారు. మార్కెట్ ధరలు.. ఎస్‌ఆర్‌వో విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాంటిది కాంగ్రెస్ సర్కారు కనీసం ఎస్‌ఆర్‌వోను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదని అన్నారు. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ పని చేస్తున్నారని ప్రశ్నించారు. హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం, ఏడు రోజుల్లో దరఖాస్తులు, ఏడు రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనుమానం కలుగుతోందన్నారు. లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ? అని నిలదీశారు. ‘‘ముంబై లాంటి మెట్రో నగరాల్లో ప్రభుత్వాలు ఇలాంటి భూములను వేలం వేసి.. ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే.. ఇక్కడ మాత్రం అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందించాలి. కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ రాజకీయ సంబంధం లేకుంటే రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలి’’ అని కేటీఆర్ అన్నారు.
ఇప్పటికే సీఎం సోదరుల ఒప్పందాలు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలన కంటే తానొక ఏజెంటులాగా రియల్ ఎేస్టట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం చుట్టూ భూ డీలర్లు ఉన్నారని, సీఎం సోదరులు, సన్నిహితులు, మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే పాలసీ అమలుకు తొందర పెడుతున్నారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు వినియోగంలో లేనప్పుడు.. అందులో కనీసం 50 శాతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మిగతా భూములను మార్కెట్ విలువ ఆదారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, శ్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో.. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రయతాన్ని రేవంత్‌రెడ్డి మానుకోవాలని, కొత్తగా తెచ్చిన ఈ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను ఎవరూ కొనవద్దన్నారు. ‘‘హెచ్‌ఐఎల్‌టీపీ కింద ఒప్పందాలు కుదుర్చుకునే వారిని ముందుగానే హెచ్చరిస్తున్నా. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. మీరు ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేస్తే నష్టపోతారు. పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో నష్టపోవాల్సివస్తుంది. మేం రాగానే ఆ భూమిని తిరిగి తీసుకుంటాం.. క్రమబద్ధీకరణను రద్దు చేస్తాం. దీనిపై పూర్త్తివిచారణ జరిపి కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ-కార్ రేసు కేసులో ఏమీ లేదని రేవంత్‌రెడ్డికీ తెలుసు..
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి కూడా తెలుసునన్నారు. తన అరెస్ట్ జరగదని, అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్‌కు లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చేసుకుపోనివ్వాలని వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని, దేశంలోనే ఇంత అక్రమ బంధం ఎక్కడా ఉండదని విమర్శించారు.
కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోంది
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విచిత్ర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సాంకేతికంగా సాకులు చూపించి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో రాజీనామా చేయించి.. ఆయనకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామా చేసినట్లు చూపుతున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కి పోలీసుల షాక్... ఆయన ప్రచారానికి..