Share News

KTR: గజం లక్షన్నర ఉంటే 4 వేలకే కట్టబెట్టే కుట్ర

ABN , Publish Date - Dec 05 , 2025 | 03:13 AM

బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం రూ.లక్షన్నర పలుకుతున్న భూములను రూ.4వేలకు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని....

KTR: గజం లక్షన్నర ఉంటే 4 వేలకే కట్టబెట్టే కుట్ర

  • ‘హిల్ట్‌’ విధానం.. భారీ భూ కుంభకోణం: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల/పటాన్‌చెరురూరల్‌, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం రూ.లక్షన్నర పలుకుతున్న భూములను రూ.4వేలకు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆరోపించారు. గతంలో ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాయని, అవి ప్రైవేట్‌ వ్యక్తులు/సంస్థల ఆస్తులు కావన్నారు. హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పు (హిల్ట్‌) విధానం ముసుగులో రూ.5 లక్షల కోట్ల విలువైన ఆ భూములను సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన అనుయాయులు దోచుకునే కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ‘హిల్ట్‌’పై బీఆర్‌ఎస్‌ పోరుబాటలో భాగంగా ఆయన గురువారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. పలు పరిశ్రమలను సందర్శించి అక్కడి హమాలీ కార్మికులతో మాట్లాడారు. ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలు వద్దంటూ.. అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి చౌకగా భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం హిల్ట్‌ విధానాన్ని తీసుకొచ్చిందని కేటీఆర్‌ విమర్శించారు. ఇక్కడి కంపెనీలను తరలిస్తే వాటిపై ఆధారపడి బతుకుతున్న లక్షల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్‌ ఇక్కడితో వదలదని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హిల్ట్‌ విధానాన్ని రద్దు చేస్తామని, ఇందుకు చట్టాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. రేవంత్‌ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావొద్దని పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్‌లో ఎకరం రూ.170 కోట్లకు భూములు అమ్ముతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. జీడిమెట్లలో కోటి రూపాయలకు ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు.

Updated Date - Dec 05 , 2025 | 03:13 AM