కృష్ణా.. నీ ప్రతిభ అద్భుతం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:31 AM
యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన సంగెం కృష్ణ పుట్టుకతో అంధుడు. రెండు కళ్లు కనిపించకపోయినా విద్యాభ్యాసం కొనసాగించాడు.

పుట్టుకతో అంధుడు.. ప్రతిభ అసామాన్యం!
భగవద్గీత శ్లోక పఠనంలో విశేష ప్రతిభ
గణపతి సచ్చిదానంద ఆశ్రమం నుంచి బంగారు పతకం
ఆధ్యాత్మికంతోపాటు చదరంగంపై మక్కువ
పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కృష్ణ
యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన సంగెం కృష్ణ పుట్టుకతో అంధుడు. రెండు కళ్లు కనిపించకపోయినా విద్యాభ్యాసం కొనసాగించాడు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే భగవద్గీత శ్లోకాలు పఠించేవాడు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన భగవద్గీత పోటీల్లో ప్రతిభ చాటి దుండిగల్‌లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం నుంచి బంగారు పతకం అందుకున్నాడు. కృష్ణకు చిన్నప్పటి నుంచీ చదరంగం ఆటపై మక్కువ. అందులో రాణించాలనే తపన ఉంది. తరుచూ చదరంగం పోటీల్లో పాల్గొనేవాడు. ఉద్యోగం చేస్తూ.. ఇటు భగవద్గీత శ్లోక పఠనంలో, చదరంగంలో రాణిస్తున్న కృష్ణ ప్రతిభ అసామాన్యం.
- ఆంధ్రజ్యోతి, భూదాన్‌పోచంపల్లి
సంగెం కృష్ణ భూదాన్‌పోచంపల్లి పట్టణానికి చెందిన చేనేత పద్మశాలి కుటుంబీకులైన సంగెం రాములు-లలిత దంపతుల రెండో కుమారుడు. ప్రాఽథమిక విద్యాభ్యాసంతోపాటు ఉన్నత పాఠశాల వరకు 1నుంచి 10వ తరగతి హైదరాబాద్‌లోని దారుషాఫాకు చెందిన ప్ర భుత్వ బాలుర అంధుల ఉన్నత పాఠశాలలో పూర్తిచేశాడు. ఈ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి స్కూల్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఇంటర్మీడియట్ 2010 నుంచి 2012 వరకు శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ స్వామిజీ ఆశ్రమంలోని ‘నేత్ర విద్యాలయం’లో పూర్తి చేశాడు. 2012 నుంచి 2017 వరకు మహాత్మాగాంధీలా కాలేజీలో బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాడు.
పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోం
ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కృష్ణ పలు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. 2017 నుంచి అనేక పోటీ పరీక్షలకు, గ్రూప్ టెస్టులకు హాజరయ్యాడు. 2022-23 విద్యా సంవత్సరంలో గ్రూప్-4 పరీక్షకు హాజరై ఉత్తమ మార్కులు సాధించాడు. 2024 డిసెంబరు నెలలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. నిత్యం తను భగవద్గీత శ్లోకాల పఠనం పోటీల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుతున్నాడు. ఏ శ్లోకమైనా సరే.. మొదటి ఒక పాదం చెప్పగానే ఆ శ్లోకం పూర్తిగా చదవడంతోపాటు ఉవాచను సైతం అప్పచెప్పేస్తాడు.
భగవద్గీత శ్లోకాల పఠనంలో..
ఆన్‌లైన్ ద్వారా భగవద్గీత శ్లోకాల పఠనం పోటీల్లో 18అధ్యాయాల్లోని 701 శ్లోకాలను అడిగినదే తడవుగా పఠించాడు. హైదరాబాద్ నగర శివారులోని దుండిగ ల్‌లోని ప్రసిద్ధ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల స్వామీజీ నుంచి బంగారుపతకం, ప్రశంసాపత్రం అందుకున్నాడు. కృష్ణ ప్రతిభను చూ సి గణపతి సచ్చిదానంద స్వామీజీ అభినందించారు.
చదరంగంలోనూ రాణిస్తూ..
చదరంగం(చెస్) ఆట అంటే ఎంతో ఇష్టం. చదరంగం పోటీలు ఎక్కడ నిర్వహించినా పాల్గొనేవాడు. ఆన్‌లైన్ చెస్ పోటీల్లో పాల్గొంటూ సాధన చేస్తున్నా డు. 2019 నుంచి చదరంగంలో శిక్షణ పొందుతున్నాడు. చదరంగంలో మంచి ప్రావీణ్యం.. ఇటు భగవద్గీత శ్లోకాల పఠనంపై విద్యార్థులను తయారు చేయాలనే ధ్యేయంతో ఉన్నానని కృష్ణ పేర్కొన్నాడు. తన ఆరాధ్యదైవం శివుడు అని అన్నారు.
ఆరాధ్య గురువులే నాకు మార్గదర్శకులు
నాకు భగవద్గీత శ్లోక పఠన పోటీలకు తయారయ్యేందుకు ఇద్దరు ఆరా ధ్య గురువులున్నారు. భూదాన్‌పోచంపల్లికి చెందిన రుద్ర బాలమణి, మల్కాజ్‌గిరికి చెందిన అనూరాధ నాకు ఆరాధ్య గురువులు. వారి పర్యవేక్షణలోనే భగవద్గీత శ్లోకాల పఠనంతోపాటు ఆన్‌లైన్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు హాజరయ్యా. ఇందులో 18 అధ్యాయాల్లో ని 701 శ్లోకాల పఠనం చేసి ప్రతిభ చాటినందుకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ నాకు బంగారు పతకం ప్రదానం చేశారు.
- సంగెం కృష్ణ