Palamuru Rangareddy Project: కృష్ణా జలాలు.. పాలమూరు రంగారెడ్డి!
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:03 AM
అసెంబ్లీ శీతాకాల సమావేశాల అజెండా ఖరారైంది. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై చర్చ చేపట్టాలని...
అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు
కృష్ణా జలాలపై పీపీటీకి చాన్సివ్వండి
కనీసం 15 రోజులు సభ నిర్వహించండి
బీఏసీ సమావేశంలో కోరిన హరీశ్
సభ నిర్వహణలో బీఆర్‌ఎస్ సంప్రదాయం కొనసాగించొద్దు: బీజేపీ, మజ్లిస్
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ శీతాకాల సమావేశాల అజెండా ఖరారైంది. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై చర్చ చేపట్టాలని ‘సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)’ నిర్ణయించింది. వీటితోపాటు ఏయే అంశాలపై చర్చ చేపట్టాలన్న దానిపై విపక్ష సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్.. వారం తర్వాత అవసరమైతే మరోమారు సమావేశమవుదామని చెప్పారు. అయితే ఏ రోజు ఏ అంశంపై చర్చ చేపట్టనున్నారన్నది ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలని హరీశ్‌రావు సహా విపక్ష సభ్యులు కోరారు. శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన అజెండా ఖరారు చేసేందుకు సోమవారం స్పీకర్ చాంబర్లో ఆయన అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంతో పాటు గ్యారెంటీల అమలు, రైతుల సమస్యలు, ఫార్మాసిటీ రద్దు, బీసీలకు 42ు రిజర్వేషన్ తదితర 15 అంశాలపై చర్చ చేపట్టాలని హరీశ్ ప్రతిపాదించారు. కాళేశ్వరం, ధరణి, ఆరు గ్యారెంటీల అమలు తదితర అంశాలపై చర్చించాలని మహేశ్వర్‌రెడ్డి కోరారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తున్న అంశంపై చర్చ చేపట్టాలని కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించారు. సింగరేణి, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపైనా చర్చించాలని సూచించారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని హరీశ్ స్పీకర్‌ను కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఇచ్చేందుకు తమకూ అవకాశం కల్పించాలని అడిగారు. ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలనూ నియమించాలన్నారు. ఏడాది మారితే ఉభయ సభలను సమావేశపరిచి గవర్నర్ ప్రసంగం చేపట్టాల్సి ఉంటుందనే సోమవారం సభను నిర్వహిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ బీఆర్‌ఎస్ హయాంలో గవర్నర్‌ను అసెంబ్లీకి రాకుండా చేసి, అవమానించారని చెప్పారు. అలాగే సభ నిర్వహణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ తప్పుపట్టారు. అయితే, సభ నిర్వహణలో బీఆర్‌ఎస్ సంప్రదాయాన్ని కొనసాగిస్తానంటే ఎలాగని మహేశ్వర్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రశ్నించారు. సభకు సరిగా రాని ఒక వ్యక్తి (కేసీఆర్), సీఎం రేవంత్‌రెడ్డిలు అసెంబ్లీ అజెండాను ముందే ఖరారు చేస్తే ఎలా? వారిద్దరూ కూడబలుక్కున్నారా? అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. సమావేశాలు ఏడాదిలో కనీసం 50 రోజులు నిర్వహించాలని, పార్లమెంటు తరహాలో స్థాయీ సంఘాలనూ ఏర్పాటు చేయాలని కూనంనేని చెప్పారు.
శాసనసభ అజెండాకు అనుగుణంగానే మండలి..
శాసనసభ సమావేశాల అజెండాకు అనుగుణంగానే మండలి సమావేశాలను నిర్వహించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రశ్నోత్తరాలు, ఇతర కార్యకలాపాలు యథావిధిగా జరిగేలా చూడాలని మండలి కార్యదర్శికి చైర్మన్ గుత్తా సూచించారు. సమస్యలపై చర్చించేందుకు కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్ష సభ్యులు కోరారు. వారం తర్వాత అవసరమైతే మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించుకుందామని చైర్మన్ చెప్పారు.