Krishna Ram Bhopal: గద్వాల్ చారిత్రక వారసత్వాన్ని నిలబెడతా!
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:17 AM
శంలోనే ఘనమైన చరిత్రకు ఆలవాలం గద్వాల్ సంస్థానం.. 400 వసంతాల చారిత్రక వారసత్వ, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తానని జీవీకే...
టీటీడీ బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలు
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక వేడుకలు
పూర్వీకుల ఆదర్శాలను పునరుద్ధరిస్తాం
గద్వాల్ సంస్థానం మహారాణి ఆదిలక్ష్మి దేవమ్ ముని మనుమడు కృష్ణ రామ భూపాల్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఘనమైన చరిత్రకు ఆలవాలం గద్వాల్ సంస్థానం.. 400 వసంతాల చారిత్రక వారసత్వ, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తానని జీవీకే కూతురు కొడుకు- గద్వాల్ సంస్థానం వారసుడు కృష్ణ రామ భూపాల్ తెలిపారు. కొన్ని వందల ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వర స్వామికి గద్వాల్ సంస్థానం ఏరువాడ జోడు పంచెలు సమర్పిస్తోంది. ఈ ఏడాది నుంచి ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నట్లు కృష్ణ రామ భూపాల్ చెప్పారు. సంస్థానం చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ముని మనుమడే రామకృష్ణ భూపాల్. గద్వాల్ వారసత్వ, సాంస్కృతిక సంపద పరిరక్షణలో భాగంగా తన పూర్వీకులు నిర్మించిన ఆలయాలన్నింటినీ సందర్శించి వాటి స్థితిగతులు తెలుసుకుంటానన్నారు. తరతరాల ఆచారం ప్రకారం దేవీ నవరాత్రుల వేళ జోగులాంబ అమ్మవారికి గద్వాల్ చీరను సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర దేవాదాయశాఖ సహకారంతో పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో అలంపూర్-జోగులాంబ ఆలయ ప్రాంగణంలో గుడి సంబురాలు నిర్వహిస్తామన్న రామ భూపాల్.. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. తద్వారా తమ పాలకులు ఆచరించిన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ఆధ్యాత్మిక, సాహిత్య కళా రంగాలకు వారు అందించిన సేవల పునరుద్ధరణకు కృషి చేస్తానని కృష్ణ రామ భూపాల్ తెలిపారు. తన పూర్వీకుల ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని నొక్కి చెప్పారు.